ED Attached Assets : ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేపల చెరువుల పేరిట రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో నిందితులకు చెందిన 20 కోట్ల31 లక్షల రూపాయల విలువైన 47 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బాపట్ల, కర్లపాలెం ప్రాంతాలకు చెందిన గండూరి మల్లిఖార్జునరావు, ప్రసాదరావు, మాడా సుబ్రహ్మణ్యం, మాడా శ్రీనివాసరావు రైతుల పేరుతో 63.74 కోట్ల రుణాలను గుంటూరు ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్నారు. చేపల చెరువుల తవ్వకం కోసమంటూ లేని భూములను ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. 247 మంది బినామీ పేర్లతో రుణాలు కాజేసిన వ్యవహారంపై 2017లోనే సీబీఐ కేసులు నమోదు చేసింది. ప్రధాన నిందితులను అరెస్టు చేసి విశాఖ జైలుకు పంపించారు. బ్యాంకు నుంచి స్వాహా చేసిన రుణాల సొమ్ముతో నలుగురు వివిధ ప్రాంతాల్లో భూములు, ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొవిడ్ కారణంగా ఈడీ విచారణ జాప్యం జరగ్గా.. మళ్లీ దర్యాప్తు వేగవంతం చేసి నిందితులకు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.
ఇవీ చదవండి: