గుంటూరు జిల్లాలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ కోసం రోడ్డెక్కారు. చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో రహదారిపై కంచెలు వేసి బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ 46గ్రూపులకు ఇంతవరకు పడలేదని మహిళలు ఆరోపిస్తున్నారు.
అధికారుల వద్దకు వెళ్తే ఇవాళ, రేపు అని తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున వద్దకు వెళ్లి విన్నవించినా కనీసం స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాల్లో రెండో విడత మాఫీ కూడా డబ్బులు పడుతున్నాయని.. తమకు మాత్రం మొదటి విడత రుణమాఫీ కూడా జరగలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని మహిళలు కోరారు.
ఇదీ చదవండి: ఓటు వేయడం మన బాధ్యత: ఎస్ఈసీ