Temperatures in AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. సమయంతో పని లేకుండా ఎండలు దంచి కొడుతున్నాయి. వాయువ్య భారత్లోని రాజస్థాన్, గుజరాత్ల మీదుగా వేడి గాలులు అధికంగా వీస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణా మీదుగా కోస్తాంధ్ర వరకూ వేడిగాలుల ప్రభావం కొనసాగుతున్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలియచేసింది. వేడిగాలుల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరగటంతో నిప్పుల కొలిమిలా ఉంటున్నాయి. ఎండ ధాటికి ప్రజలు పగటి వేళల్లో బయటకు రావాడమే మానేశారు. నిత్యం అనేక వాహనాలతో రద్ధీగా ఉండే దారులు.. ఎండ తీవ్రత ఎక్కువ కావటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా అగ్గిపోయింది. తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల వల్ల ఎండలో బయటకు వెళ్తున్న ప్రజలు దాహార్తిని తీర్చుకోవటానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో.. చలివేంద్రాల సంఖ్య తగ్గింది. దీనివల్ల ప్రజలు పదుల రూపాయలు వెచ్చించి తాగునీటి బాటిళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. కూలీ పనులకు వెళ్తున్న దినసరి కూలీలు, ఇతర అవసరాలకు బయటకు వెళ్తున్నవారు ఎండ తీవ్రత వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాల వారీగా నమోదైన ఉష్ణోగ్రతలు.. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో గరిష్టంగా పల్నాడులో 43.09 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రకాశం జిల్లాలో 43.01 డిగ్రీలు నమోదైంది. నెల్లూరు జిల్లాలో 42.8, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 42.3 డిగ్రీలు రికార్డు అయ్యింది. గుంటూరులో 41.75 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 41.7, తిరుపతిలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. నంద్యాల 41.15, చిత్తూరు 40.74, కడప 40.6, నెల్లూరులో 40.65 డిగ్రీల మేర రికార్డు అయినట్టు వెల్లడించింది. పశ్చిమ గోదావరి 40.5, ఏలూరు 40.5, పోలవరం 40, విజయనగరం 40.5 నమోదైంది. బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 40.4, అనకాపల్లి 40.3 డిగ్రీలు, కృష్ణా 40.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక ఎన్టీఆర్ 39.9, తూర్పుగోదావరి 39.8 డిగ్రీలు, బాపట్ల 39.1, అన్నమయ్య 39.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.
ఇవీ చదపండి: