Dengue Malaria Cases Rise in AP Due to Lack of Sanitation: రోజురోజుకీ పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులకు తోడు వైరల్ జ్వరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఇతర ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువ చేసే వారిలో జ్వరాల బారిన పడుతున్నారు. ముందుగా దగ్గు, జలుబు, గొంతునొప్పితో నీరసపడి.. తర్వాత జ్వరం బారినపడుతున్నారు. వర్షాకాలం కావడంతో పాటు పెరిగిన అపరిశుభ్రత వల్ల పట్టణాలు, నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. వీటికి నీరు, గాలి కాలుష్యం తోడవుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యాలపై ఈ జ్వరాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
రాష్ట్రంలో కిందటేడాది 19 వందల 46 మలేరియా, 6 వేల 3వందల 80 డెంగీ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది సెప్టెంబరు 19 నాటికే వాటి సంఖ్య మలేరియా కేసులు 4 వేల 3 వందల 11, డెంగీ కేసులు 3 వేల 9 వందల 18 చేరాయి. ఉత్తరాంధ్రలో ఈ వ్యాధుల బెడద మరీ ఎక్కువగా ఉంది. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 19వ తేదీ నాటికి ఏకంగా 3 వేల 107 మలేరియా కేసులు నమోదయ్యాయి. కిందటేడు ఈ సంఖ్య 7వందల 86 గా మాత్రమే ఉంది.
విజయనగరం జిల్లాలో.. గత సంవత్సరం మొత్తం 29 మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 2 వందల 80 మంది ఆ మహమ్మారి బారిన పడ్డారు. డెంగీ కేసులు విశాఖ జిల్లాలో 8 వందల 5, విజయనగరం జిల్లాలో 3 వందల 23 వరకు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కిందటేడాది 11 వందల 16, 4వందల 90 చొప్పున డెంగీ కేసులు రికార్డయ్యాయి.
పార్వతీపురం మన్యం జిల్లా.. పాచిపెంట సీహెచ్‌సీ పరిధిలో జ్వరాలు ఎక్కువగా ఇబ్బందిపెడుతున్నాయి. ఇక్కడి పీహెచ్‌సీకి నిత్యం 20 మంది వరకు జ్వరంతో బాధపడుతూ వస్తున్నారు. జిల్లా కేంద్రం ఆసుపత్రిలో వీరి సంఖ్య 50 నుంచి 100 మంది వరకూ ఉంది. నర్సీపట్నం, పాయకరావుపేట, చౌడవరం నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 37 డెంగీ కేసులు వెలుగుచూశాయి. మరోవైపు వైరల్ జ్వరాలూ వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆగస్టులో 8 వేల 3 వందల 16, సెప్టెంబరులో ఇప్పటివరకు 4 వేల 5వందల 64 మంది ఈ జ్వరాల బారిన పడ్డారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా.. చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో గురువారం జ్వరలక్షణాలతో అక్కడి పాఠశాల విద్యార్థులు కొందరు చికిత్స పొందారు. కోస్తా, రాయలసీమల్లో వైరల్ జ్వరాల బెడద ఎక్కువగా ఉంది. నమోదు కాని మలేరియా, డెంగీ కేసులు వేలల్లోనే ఉంటాయి. వైరల్ జ్వరాలైతే లెక్కేలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విజయవాడ సర్వజనాసుపత్రిలో.. రోజుకు కనీసం 10 మంది వరకు వైరల్ జ్వరాలతో చేరుతున్నారు. అడపాదడపా డెంగీ కేసులు కూడా బయటపడుతున్నాయి. ఏలూరు జిల్లా పరిధిలోని ఏజెన్సీ, మెట్ట మండలాల్లో వైరల్ జ్వరాలు ఎక్కువయ్యాయి. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో వస్తున్న రోగులతో రద్దీగా ఉంటోంది. ప్రాంతీయ ఆసుపత్రికి జులైలో జ్వర సంబంధ లక్షణాలతో 5వందల 34 మంది రోగులు వస్తే.. వీరిలో 48 మందికి మలేరియా, టైఫాయిడ్ నిర్ధారణ అయ్యాయి.
సెప్టెంబరులో 21వ తేదీ వరకు 2వేల 200 మంది రోగులు ఆసుపత్రికి వచ్చారు. సాధారణం కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. మలేరియా, టైఫాయిడ్ కేసులు 72 నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు చివరి నాటికి ఇన్ పేషెంట్స్ 16వందల 9 కాగా.... అవుట్ పేషెంట్స్ సంఖ్య 7వేల 199గా ఉంది. నెల్లూరులో జలుబు, దగ్గుతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. దగ్గు వస్తే వెంటనే తగ్గడంలేదని పలువురు రోగులు వాపోయారు.
చిత్తూరు జిల్లాలో.. వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌లో 8, మేలో 10, జూన్ 20, జులైలో 18, ఆగస్టులో 17, సెప్టెంబరులో ఇప్పటి వరకు 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మలేరియా కేసులు 2 వచ్చాయి. ఇటీవల తవణంపల్లె మండలంలోని దిగువమాఘం, తొడతర, క్రిష్ణాపురం, చారాల గ్రామాల్లో నలుగురు డెంగీ బారిన పడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారు వీరికి అదనం.
Sanitation Problem in AP: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి..
జ్వరాలు ముసురుతున్నా.. పారిశుద్ధ్య పరిస్థితులు మాత్రం మెరుగుపడటం లేదు. వీటి నిర్వహణకు వైద్య సిబ్బంది, పంచాయతీలు కలిపి ఒక యాప్ వినియోగిస్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను గుర్తించి ఫొటో తీసి.. యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ చిత్రం నేరుగా పంచాయతీ కార్యదర్శికి చేరుతుంది. అక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టిన అనంతరం కార్యదర్శులు ఫొటోలు తీసి.. యాప్‌లో మళ్లీ అప్‌లోడ్ చేయాలి. అప్పుడే సమస్య పరిష్కారమైనట్లు నిర్ధరిస్తారు. ఈ ప్రక్రియ అంతా మొక్కుబడిగా సాగుతోంది. దీనివల్ల దోమల దండయాత్ర తప్పడంలేదు. వాటి నిర్మూలనకు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా కొన్నిచోట్ల అవి మూలనపడ్డాయి.
కోనసీమ జిల్లా.. అయినవిల్లి మండలంలో మురుగుకాల్వల శుభ్రం జరగక దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూర నగర పంచాయతీ పరిధిలో కలుషిత నీరే అక్కడి స్థానికులకు దిక్కవుతోంది. కాలువల్లోని మురుగు తొలగించక పోవడం వలన నరసరావుపేటలో దోమల సమస్య అధికంగా ఉంటోంది. ఫాగింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. పురపాలక శాఖ ఉపయోగించడం లేదు. మరికొన్ని పంచాయతీ ఆఫీసుల్లో పెట్రోల్, డీజిల్‌కు అవసరమైన నిధులు లేకపోవడంతో ఈ యంత్రాలను వినియోగించడం లేదు.
Poor Drainage System in Vijayawada : నగరానికి శాపంలా డ్రైనేజీ వ్యవస్థ.. ఎక్కడ చూసినా మురుగే..