Damage Andhra Pradesh Rural Roads : అడుగుకో గొయ్యి, గజానికో గుంత.. ఇదీ గుంటూరు జిల్లాలో గ్రామీణ రహదారుల పరిస్థితి. వర్షాకాలం రావటంతో గోతుల్లో నీరు నిలబడి వాహనాలు కూడా వెళ్లలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమది సంక్షేమ రాజ్యమని పదే పదే ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. పల్లెల రహదారుల్ని మాత్రం గాలికి వదిలేసింది. నాలుగేళ్లుగా కనీస నిర్వహణ లేకపోవడంతో తెనాలి డివిజన్ పరిధిలోని రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. తరుచుగా ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు రహదారుల్ని బాగు చేసి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట గ్రామం నుంచి మున్నంగి వెళ్లే రహదారి. ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే.. వాహనాదారులు ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. అత్తోట నుంచి మున్నింగి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాదు సమీప గ్రామాల్లోని చాలా రహదారులు ఇలాగే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణించే మహిళలు అయితే కచ్చితంగా బండి దిగి కాలి బాట పట్టాల్సిందే. రహదారి మెుత్తం గుంతలు పడి ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇటీవల తెనాలి-సిరిపురం మార్గంలో గుంతల కారణంగా రోడ్డుపైనే కారు ఇరుక్కు పోయింది. గోతుల్లో నీరుండటంతో వాటిలోనుంచి వెళ్తే కారు ఇరుక్కుంటుందని భావించిన కారు డ్రైవర్ కొంచెం పక్కగా పోనిచ్చాడు. అయితే కారు కింది భాగం నేలకు తగిలి అక్కడే ఇరుక్కుని ముందుకు కదల్లేదు. పలుగులు తెచ్చి రోడ్డుని కొంత తవ్విన తర్వాత మాత్రమే కారుని పక్కకి తీయగలిగారు. ఇలా జిల్లాలోని చాలా గ్రామాల్లో గ్రామీణ రహదారులు చిద్రమై ప్రయాణానికి ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి. రోడ్డుపై వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.
పల్లెలే రాష్ట్ర ప్రగతికి, దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే అభివృద్ధి సాధ్యం. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల విషయం గాలికొదిలేసిందనే చెప్పాలి. పల్లెల్లో కనిపిస్తున్న రహదారులే అందుకు నిదర్శనం. కొల్లిపర మండలంలోని కుంచవరం, దంతలూరు, వల్లభాపురం, మున్నంగి, ఎరుకలపూడి, పిడపర్తిపాలెం, పిడపర్రు, చివలూరు వంటి దాదాపు పది గ్రామాలకు సంబందించిన రహదారులు ఇలాగే ఉన్నాయి.
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ఈ రహదారుల నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కొత్త రహదారి వేయటానికి వచ్చిన పనులు చేపట్టిన గుత్తేదారు.. రోడ్డు తవ్వి వదిలేశాడు. బిల్లులు వస్తాయో రాదోనన్న సందేహంతో మధ్యలోనే పనులు ఆపేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్గంలో ఇసుక లారీలు అధిక లోడుతో వెళ్లుతుండటంతో రహదారి పూర్తిగా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పాఠశాల బస్సు సైతం ప్రమాదానికి గురైందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెనాలి మండలంలోని కొలకలూరు, నందివెలుగు రహదారులు సైతం వాన నీరు, భారీ గుంతలతో వాహనచోదకులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే భయపడేలా తయారయ్యాయి. నాలుగేళ్లుగా కనీస పర్యవేక్షణ లేకపోవడంతో.. ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారులు బాగు చేయాలని కోరుతున్నారు.