కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం బుధవారం నుంచి కర్ఫ్యూని అమలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12గంటల నుంచి అత్యవసర సేవలు మినహా అన్నింటిని అధికారులు నిలిపివేయించారు. దుకాణాలు మూసివేయించారు. 144 సెక్షన్ అమలు చేశారు. ఇప్పటి వరకూ గుంటూరు నగరంతో పాటు ఆయా పట్టణాల్లో స్థానిక పరిస్థితుల్ని బట్టి వ్యాపారాల పనివేళలు కుదించారు. కానీ ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవటంతో దాన్ని జిల్లా మొత్తం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దుకాణాలు, ఇతర కార్యాలయాలను మధ్యాహ్నానికి మూసివేశారు. కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్లకు కూడా అదే పరిస్థితి. రోడ్లపై చిరువ్యాపారులు కూడా మధ్యాహ్నానికి అన్నీ సర్దుకున్నారు. వ్యాపారాలతో నిత్యం కళకళలాడే బ్రాడీపేట, పట్నంబజార్ వంటి ప్రాంతాలు బోసిపోయి కనిపించాయి. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు. మొదటి రోజు కావడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు రహదారులపై వాహనాలు కనిపించాయి. తర్వాత రహదారులు ఖాళీ అయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన వీధుల్లో తనిఖీలు చేపట్టారు. రహదారులపై అనవసరంగా తిరిగే వారికి జరిమానాలు విధించారు.
నిత్యావసరాలకే రావాలి
ఉదయం 6గంటలకు ఆంక్షలు తొలగనున్నాయి. పాలు, కూరగాయలు, కిరాణా సరకులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోపు వెళ్లి కొనుగోళ్లు పూర్తి చేసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పనుల కోసం వెళ్లాలన్నా మధ్యాహ్నం 12గంటల్లోపే అవకాశం ఉంటుంది. రోడ్లపైకి జనం ఎక్కువగా రావటం, ఇతరులతో కలవటం ద్వారా వైరస్‌ని కట్టడి చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో రోజూ వెయ్యి నుంచి 2వేల వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కర్ఫ్యూని అమలు చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఏదైనా అవసరం ఉంటేనే బయటకు రావాలి. కేసులు ఇంకా పెరిగితే లాక్ డౌన్ విధించాల్సి రావొచ్చు. అప్పుడు ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాలపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది. అంత వరకూ రాకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసరం.
12గంటలకల్లా గమ్యస్థానం
కర్ఫ్యూ అమలు చేసే క్రమంలో ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారు. మధ్యాహ్నం 12గంటల వరకూ అవకాశమున్న మార్గాల్లో బస్సులు తిప్పారు. దూరప్రాంతాలైన వినుకొండ, రేపల్లె, మాచర్లకు ఉదయం 10గంటలకే సర్వీసులు ఆగిపోయాయి. ఆ తర్వాత బస్టాండుకు వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. గమ్యస్థానానికి 12గంటలకల్లా చేరగలిగిన ప్రాంతాలకే సర్వీసులు నడిచాయి. ఈ విషయం తెలియక చాలామంది ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు 10గంటలకే నిలిపివేసిన విషయం తెలియక పడిగాపులు కాశారు. అధికారులు ఆ విషయం కనీసం మైక్ ద్వారా కూడా ప్రకటించలేదు. దీంతో బస్సులు వస్తాయని ఎదురుచూసిన ప్రయాణికులు తర్వాత విషయం తెలిసి వెనక్కు వెళ్లిపోయారు. కొందరు సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో వెయ్యికి పైగా ఆర్టీసీ బస్సులుండగా అందులో 40శాతం మాత్రమే నడిపినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులు, ఆటోలు కూడా 12గంటల తర్వాత రోడ్లపై కనిపించలేదు. ఆసుపత్రులు, రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులతో ఉన్న ఆటోలకు మాత్రం రుజువులు చూపిస్తే వదిలిపెట్టారు.
ఇదీ చదవండి