ఖరీఫ్ పంటకు రైతులు ఇప్పటినుంచే సిద్ధం అవుతున్నారు. పొలాలు దుక్కులు దున్నుతూ.. గట్ల పనులు చేసుకుంటున్నారు . అయితే వర్షాకాలంలో పడే భారీ వర్షాలకు వాగులు , నదుల నుంచి వచ్చే నీరు సముద్రం లోకి చేరుతుంది. అధిక వర్షాలు కురిస్తే పంట పొలాల్లో నీరు కాలువల ద్వారా బయటకు పంపేందుకు అనుకూలంగా డ్రైనేజీలు ఉండాలి . కానీ తీరప్రాంతాల్లో అందుకు భిన్నంగా చేలకంటే ఎత్తులో కాలువలు ఉన్నాయి. మరోవైపు కాలువలు పూడికతో నిండి పోవడం వలన పొలాల నుండి వచ్చే నీరు డ్రైనేజీ లోకి పారడం లేదు. దీనికితోడు గుర్రపు డెక్క, తూటికాడ పేరుకుపోవడంతో నీరు ప్రవాహం సరిగా లేక వర్షాకాలంలో పంట పొలాలు ముంపుకు గురయ్యే పరిస్థితి పరిస్థితి నెలకొంటుంది.
డెల్టాలో ప్రధానంగా రేపల్లె ఓల్డ్ కోర్స్, జగజ్జెరు, బడే కూచినపూడి, జన్నే, తుంగ, పాకలగాడి, అల్లపర్రు, పిల్లవాగు వంటి 150 వరకు డ్రైనేజీలు ఉన్నాయి. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ కాలువల వలన భారీ వర్షాలు కురిస్తే.. వర్షపు నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేక వేసిన వరి నాట్లు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. దీంతో రెండోసారి నాట్లు వేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి రెండింతలు అయ్యి భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానలు కురిసిన సమయంలో హడావిడిగా డ్రైనేజీలో పేరుకున్న తూటి కాడ, గుర్రపు డెక్క మొక్కుబడిగా తొలగించి చేతులు దులుపుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కాలువలకు మరమ్మతులు చేయమని ఎన్నిసార్లు చెప్పినా తమ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు కాలువల్లో పూడికలు సమస్యను శాశ్వతంగా పరిష్కరించి... నీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: vishnuvardhan reddy: ప్రధాని మోదీ పేదల పక్షాపతి: భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డి