CPS Agitation in AP: జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు పలుచోట్ల నిరసన తెలిపారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి.. విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ తీసుకొచ్చిన జీపీఎస్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా.. సచివాలయంలోని అన్ని బ్లాకుల నుంచి సీపీఎస్ ఉద్యోగులు బయటకు వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఎస్ అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1వ తేదీ.. ఉద్యోగుల పాలిట చీకటి దినమని.. పాతపెన్షన్ పునరుద్ధరించాలనే నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్మ పోరాట నిరసన చేపట్టిన ఉద్యోగులు.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ ఓ గోల్‌మాల్ పథకమని ఎద్దేవా చేశారు.
సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగులు.. ధర్మ పోరాట నిరసన చేపట్టారు. ఈ క్రమంలో "పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు" అంటూ నినాదాలు చేశారు. మంచి చేస్తారని జగన్‌ని సీఎం చేస్తే.. ఆయన తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో జ్యోతిబా ఫూలే పార్క్ వద్ద ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని నిరనస చేపట్టారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు.. ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుని.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే.. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఉద్యోగులు హెచ్చరించారు.
Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: జీపీఎస్‌లో పెన్షన్‌కు గ్యారంటీ లేనట్టేనా ?
"ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది మా సీపీఎస్ ఉద్యోగులే. నమ్మి.. ఆయన వెంట వచ్చిన మా సీపీఎస్ ఉద్యోగులను ఎందుకు దూరంపెట్టి.. సీక్రెట్‌గా ఆర్డినెన్స్ చేస్తున్నారు. అంటే ఇందులో ఏదో మోసం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇంతకుముందు రెండుమూడు సార్లు మమ్మల్ని పిలిచి మాట్లాడిన ఈ ప్రభుత్వ పెద్దలు.. కనీసం మాకు ఇంటిమేషన్ చేయకుండా ఎందుకు సమావేశం పెట్టి నిర్ణయాలు తీసుకున్నారు. జీపీఎస్‌లో మేము నెల నెలా దాచుకున్న సొమ్మంతా ప్రభుత్వం తీసుకుని.. మాకు 50శాతం పెన్షన్ ఇస్తుందని విన్నాం. ఇది చాలా అన్యాయం. అధికారంలోకి వచ్చిన తర్వాత మా సీపీఎస్ ఉద్యోగులంతా సీఎం జగన్ వద్దకు వెళ్లగా.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లవుతున్నా దాన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం అమలు చేసే వరకు.. ఉద్యమం ఆగదు." - సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన