CPI STATE SECRETARY : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేందుకు తెదేపా, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలతో కలసి వెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీపీఐ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీలలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పోరాటాల అంశంపై చర్చిస్తామని, ఇప్పటికే కొన్ని పార్టీలతో మాట్లాడినట్లు చెప్పారు.
రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు : రాష్ట్రంలో అభివృద్ధి జాడ ఎక్కడ కనిపించలేదన్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం బెదిరింపులతో పారిపోతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చే ఏడాది దిగేపోయే నాటికి 10 లక్షల కోట్లు అప్పులు చేస్తుందన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో ఓటుకు 5 వేలు చొప్పున నగదు పంపిణీ చేసి అధికారంలోకి రావాలని జగన్ సిద్ధం అవుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ ఆనంతబాబు తన కారు డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని, దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. హత్య చేసి జైల్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీకి పూల దండలు వేసేందుకు వైసీపీ నాయకులు గుంపులుగా రావడం, పాలభిషేకలు చేయడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిలకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగిన మోడీ, అమరావతి లో మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడుల గురించి ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సీఎం జగన్ కు మోడీ అండగా ఉన్నారని విమర్శలు చేశారు.
ఇవీ చదవండి