ఈ చిత్రం చూస్తే ఎవరికైనా దుఃఖం ఆగదు. తల్లిదండ్రుల ఫొటో చూసుకుని వారు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్న మద్దాలి నారాయణ పుట్టుకతోనే అంధుడు. కొవిడ్ అతనికి తల్లిదండ్రులను దూరం చేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదోవార్డులో నివాసం ఉంటున్న నారాయణ తల్లి విజయలక్ష్మి మే 19న మరణించగా, ఆ తర్వాత రెండురోజులకే తండ్రి వెంకటసత్యనారాయణను కోల్పోయాడు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల కళ్లతో లోకాన్ని చూసిన నారాయణ జీవితం ఇప్పుడు పూర్తి అంథకారంగా మారింది. కుటుంబ పెద్దల్ని కోల్పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు.. మరోవైపు పెద్దన్నయ్య రాముది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అతనికి ఆటోనే జీవనాధారం. కొవిడ్‌తో చాలా మంది ఆటోలు ఎక్కడం తగ్గించారు. జీవితం గడవటమే గగనమనుకుంటున్న తరుణంలో అంథుడైన తమ్ముడిని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్న పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో నారాయణ జీవనానికి భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందితే నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయని లేకుంటే జీవితానికి భరోసా లేకుండా పోతుందని కన్నీటి పర్యంతమవుతున్నాడు..
ఇదీ చదవండీ.. కొన్నిరోజులు ఆగు నాన్న అన్నందుకే..ఆత్మహత్య చేసుకున్నాడు!