కరోనా టీకా డ్రై రన్ కోసం గుంటూరు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 3 కేంద్రాల్లో డ్రైరన్ చేపట్టనున్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, ఏటీ ఆగ్రహారంలోని ఎస్.కె.బి.ఎం పురపాలక ఉన్నత పాఠశాల, మంగళగిరి రోడ్డులోని వేదాంత ఆసుపత్రిని డ్రైరన్ కోసం ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ మూడింటిని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 7.30 గంటలకు డ్రై రన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకూ టీకా డ్రైరన్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలకు అందించేందుకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేసేందుకు ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 28న కృష్ణాజిల్లాలో మాత్రమే డ్రై రన్ నిర్వహించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మూడు కేంద్రాలలో డ్రై రన్ చేపట్టారు. ఎక్కువ ప్రాంతాల్లో డ్రై రన్ చేపట్టడం ద్వారా సాంకేతిక సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని పరిష్కరించటంపై దృష్టి సారిస్తారు. అలాగే సిబ్బంది మధ్య సమన్వయాన్ని పరిశీలిస్తారు. ప్రతి కేంద్రాన్ని మూడు విభాగాలుగా విభజించి డ్రై రన్ నిర్వహిస్తామని గుంటూరు జిల్లా అదనపు డీఎంహెచ్వో జయసింహా తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం