రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పరంగా చూస్తే గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 387కు చేరింది. తాజా కేసులతో కలిపి పాజిటివ్ కేసులు గుంటూరులో 174, నరసరావుపేట పట్టణంలో 167కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కేసులు లేని గ్రీన్ జోన్‌గా ఉన్న తెనాలిలో పాజిటివ్ కేసు నమోదవ్వటంపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో పారిశుద్ద్య కార్యక్రమాలు, ఆరోగ్య సర్వే చేపట్టారు.
ఇప్పటి వరకు జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 198 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 181 మంది గుంటూరు ఐడీ ఆసుపత్రి, మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా జిల్లాలో కరోనా ఎక్కువగా విస్తరించినట్లు కేంద్రం నుంచి వచ్చిన బృందం చెప్పింది. విదేశీ ప్రయాణాలు సాగించిన వారిద్వారా 3 కేసులు మాత్రమే వచ్చినట్టు గుర్తించారు.
లాక్ డౌన్ తొలగించిన తరువాత చేపట్టాల్సిన చర్యలపైనా కేంద్ర వైద్య బృందం... జిల్లా అధికారులకు సూచనలిచ్చింది. కంటైన్మెంట్ క్లస్టర్లలో సరుకులు డోర్ డెలివరీ చేయడం కొనసాగించాలన్నారు. ఆసుపత్రుల్లో కరోనా వైరస్ తీవ్రత ఆధారంగా రోగులకు వేర్వేరు వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు లేదా నాలుగు కేటగిరీలుగా విభజించేలా వార్డులు ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్దులను 28 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్ చేసిన తర్వాతే ఇంటికి పంపేందుకు అనుమతించాలని సూచించారు.
ఇదీ చదవండి: