ఉత్సవాలు, వేడుకలు, వివాహాలు.. సందర్భమేదైనా నృత్యకళాకారుల సందడే వేరు. మ్యూజిక్ మోగగానే.. చిందులతో ఉత్సాహం నింపుతారు. జాజ్.. వెస్ట్రన్.. శాస్త్రీయం.. సంగీతమేదైనా కళ్లు తిప్పుకోనీయకుండా ప్రదర్శనలు చేస్తారు. నృత్యమే జీవనాధారంగా మార్చుకున్న వాళ్ల జీవితాల్లో కరోనా అల్లకల్లోలం నింపింది. పాఠశాలలు మూసేయటంతో పిల్లలకు నృత్య బోధన తరగతులు రద్దు అయిపోయాయి. జీతాలు ఇవ్వటం అనవసరం అని కొన్ని పాఠశాలలు ఉద్యోగాల్లోంచి తీసేశాయి.
ఇక పెళ్లిళ్లు, సంబరాలపై ఆంక్షలు ఉన్నాయి. ఒకవేళ అనుమతులు వచ్చినా... సాధారణంగా తంతు ముగించేయాలనే అందరూ ఆలోచిస్తుండటంతో.. ఇప్పట్లో తమకు పనులు వచ్చే అవకాశమే లేదని కళాకారులు వాపోతున్నారు. డ్యాన్సర్లు, నృత్యదర్శకుల సంఘాల ప్రతినిధులే చందాలు వసూలు చేసి పేద కళాకారులకు అండగా నిలబడుతున్నారని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉపాధి లేక.. ఇంట్లో కష్టాలతో కాపురం చేయాల్సి వస్తోందని... తొలి విడత లాక్‌డౌన్‌లో చేసిన అప్పులే ఇంకా తీర్చలేక మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని చెప్పారు. నిత్యావసరాలకూ ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. నేరుగా ఆర్థిక సాయం చేయలేకపోయినా.. ఉపాధి దొరికే మార్గాలు చూపిస్తే కష్టాలు నుంచి గట్టెక్కుతామని నృత్యకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: