గుంటూరు జిల్లాలో కరోనా కేసులు 11వేలు దాటాయి. ఇందులో 5వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. రోజురోజుకీ వందలాది మంది కొత్తగా కొవిడ్ బారిన పడుతున్నారు. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచటంపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌తో పాటు ఎన్ఆర్ఐ, కాటూరి వైద్యకళాశాల అసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్‌లో 700, మంగళగిరి ఎన్ఆర్ఐ వైద్యకళాశాల ఆసుపత్రి 500, చౌడవరంలోని కాటూరి వైద్యకళాశాల ఆసుపత్రిలో 540 పడకలున్నాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో 28, గుంటూరు ఐడీ ఆసుపత్రిలో 15మందికి చికిత్స అందించే వీలుంది. వీటితో పాటు తెనాలి, నర్సరావుపేట, బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రులను కోవిడ్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తే మరో 500 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్ రోగులకు వైద్యసేవలు మొదలయ్యాయి. లలిత, సాయిభాస్కర్, అమరావతి హాస్పిటల్స్, తులసి ఆసుపత్రి, శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి అనుమతించగా...వారు చికిత్సలు ప్రారంభించారు. వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి, తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి, పిడుగురాళ్లలో అంజిరెడ్డి ఆసుపత్రి, నర్సరావుపేట జీబీఆర్ ఆసుపత్రుల్లో కరోనా రోగులను చేర్చుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేవారికి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్స అందుతుంది. కొవిడ్ చికిత్స ధరలను ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది.
జిల్లాలో కేసులు అధికమవుతుండటంతో అవసరాన్ని బట్టి మరికొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 3వేల 715 పడకలు చికిత్స కోసం సిద్ధం చేశారు. అలాగే వ్యాధి తీవ్రత లేని వారి కోసం కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ 4,500 మందికి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తున్నారు. దాదాపు 30నుంచి 40శాతం ఇలాంటి వారే ఉంటున్నారు. ఇక కొద్దిగా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు పంపిస్తున్నారు.హోం ఐసోలేషన్, కొవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారికి వ్యాధి లక్షణాలు తీవ్రమైతే తప్పనిసరిగా ఆసుపత్రికి తరలిస్తామని అధికారులు తెలిపారు. ఇక ఆసుపత్రుల సంఖ్య పెరగటంతో అక్కడ సరిపడా సిబ్బంది నియామకానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్ కేంద్రాల్లో 700మంది నర్సులు, పారామెడికల్ సిబ్బంది అవసరమని గుర్తించారు. ప్రస్తుతం నర్సింగ్, పారామెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న చివరి ఏడాది విద్యార్థులను అక్కడ నియమించనున్నారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ మొదలైంది. రెండు, మూడు రోజుల్లోనే వారంతా విధుల్లో చేరనున్నారు.
ఇదీచదవండి