భాజపా, వైకాపా నేతలు అభివృద్ధిపై సవాల్ విసురుకోవడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని భాజపా, వైకాపా నేతలు తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గుంటూరు నగరంలో జరిగిన అభివృద్ధిపై ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గుంటూరు 57వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే... బెదిరింపులకు గురి చేస్తున్నారని మస్తాన్ వలీ ఆక్షేపించారు. ప్రభుత్వ స్థలాలను అమ్మడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గుంటూరు నగరానికి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు.