జిల్లాలో ఉన్న 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా 32 చోట్ల కొవిడ్-19 పరీక్ష కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్యే విడుదల రజినితో కలిసి పలు అంశాలపై మాట్లాడారు. కోవిడ్ అనుమానమున్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే కరోనాపై విజయం సాధించేందుకు వీలు కలుగుతుందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై వివక్ష చూపొద్దని కోరారు. అధికారులు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదని, వారి తప్పిదం వల్ల కరోనా వ్యాప్తి చెందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు రూరల్ ఎస్పీ విజయ రావు, జెసీ-3 ప్రశాంతి, వైద్య ఆరోగ్య అధికారి యాస్మిన్, ఆర్డిఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ వీరారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి...