గుంటూరు జిల్లా పల్నాడులో చేపట్టనున్న వరికపుడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకునే భూములకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్.. అధికారులను ఆదేశించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ అంశంపై వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో.. కలెక్టర్ చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం వరికపుడిసెల ప్రాజెక్ట్ నిర్మాణానికి 340 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. వరికపుడిసెల ప్రాజెక్ట్ నిర్మాణానికి అటవీశాఖ నుంచి సుమారు 50 ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములను గుర్తించి అటవీశాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ అధికారులను.. ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వచ్చే వారంలో మరోసారి సమావేశం నిర్వహించి తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ వివేక్ యాదవ్ వివరించారు.
ఇదీ చదవండి: మహిళాభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషకాహార ప్రదర్శన