CM Jagan Said Some MLAs are not Getting Tickets: 175కి 175 స్థానాల్లో గెలుపు సాధ్యమే క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు చాలా బాగా ఉన్నాయని సీఎం జగన్ నాలుగు రోజుల కిందట వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఉండదనీ స్పష్టం చేశారు. మరికొందరిని ఎంపీలుగా బరిలోకి దింపనున్నట్లు సీఎం ఇప్పటికే చెప్పారని తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగి, ఉన్నతస్థాయిని అనుభవించి ప్రస్తుతం మంత్రిమండలిలోనూ ఉన్న ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. వారిని ఎంపీలుగా పంపేందుకు సీఎం సిద్ధమయ్యారు. వీరితోపాటు మరో ఇద్దరు మంత్రులను కూడా లోక్‌సభకు పోటీ చేయించనున్నారంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు ఈసారి అసలు టికెట్లు ఉండవని సీఎం తేల్చి చెప్పినట్లు తెలిసింది. వీరిలో SC ఎమ్మెల్యేలూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపనున్నారు.
ఒక సీనియర్ మంత్రి తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని, ఎమ్మెల్యే టికెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. అయితే ఇప్పుడు సాధ్యం కాదని సీఎం చెప్పారని తెలిసింది. ప్రస్తుతానికి తమరే పోటీ చేయలని 2026లో మిమ్మల్ని రాజ్యసభకు పంపుతామని చెప్పినట్లు సమాచారం. అప్పుడు ఖాళీ అయ్యే తమ ఎమ్మెల్యే స్థానంలో తమ అబ్బాయితో పోటీ చేయిద్దామని సదరు మంత్రికి చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అదే జిల్లాకు చెందిన ఎంపీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి సంకేతమూ రాలేదంటున్నారు. వీరి పక్క జిల్లాలోని మరో సీనియర్ మంత్రిని ఈసారి ఎంపీగా పోటీ చేయాలని సీఎం సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అదే ఎంపీ స్థానంలో ఈ మంత్రిని లేదా శాసనసభ సభాపతిని బరిలోకి దింపేందుకు సీఎం నిర్ణయించినట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది.
శాసనసభాపతి కూడా ఈసారి తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు సీఎంను కోరారు. ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరో జిల్లాలో ప్రస్తుత మంత్రిని ఎంపీగా, ఇప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేగా బరిలోకి దింపే అవకాశం ఉందన్న చర్చ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎస్టీ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీని, మరో ఎమ్మెల్యే స్థానంలో ఎంపీని పోటీకి దించే అవకాశం ఉందంటున్నారు. ముగ్గురు లేదా నలుగురు మంత్రులను ఈసారి ఎంపీలుగా పోటీ చేయించేందుకు సీఎం రంగం సిద్ధం చేశారు. అదే విషయాన్ని ఆ మంత్రులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది.
తూర్పుగోదావరిలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఉండదని ముఖ్యమంత్రి ఇప్పటికే స్వయంగా చెప్పినట్లు తెలిసింది. ఏలూరు ఎంపీ ఈసారి పోటీ చేయనని, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పనిచేయాలనే యోచనలో ఉన్నారని సమాచారం. ఆయన బరిలో ఉండకపోతే ఆ స్థానంలో జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రిని బరిలోకి దింపేందుకు సీఎం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలోనూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను ఈసారి లోక్‌సభ బరిలో దింపనున్నారు.
కదిరిలో ఈసారి ముస్లిం అభ్యర్థిని పోటీ చేయించేందుకు సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్‌ను కదిరి వెళ్లాల్సిందిగా ఆయన సూచించారు. 2019లో హిందూపురంలో పోటీ చేసి ఓడిపోయి, తర్వాత అక్కడ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్న ఇక్బాల్‌ను ఇటీవల ఆ పదవి నుంచి తప్పించి దీపికకు ఆ బాధ్యతను అప్పగించారు. తనను హిందూపురం నుంచి తప్పించడంపై కినుక వహించిన ఇక్బాల్ కదిరికి వెళ్లాలన్న సీఎం ప్రతిపాదనపై తన సమ్మతిని తెలియజేయలేదు.
అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా ప్రస్తుతం కొనసాగుతున్నవారిలో కొందరికి టికెట్లు ఉండకపోవచ్చు. ఇప్పటికే విశాఖ తూర్పు బాధ్యతను విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు(MP MVV Satyanarayana) ఇచ్చేశారు. రాజమహేంద్రవరం నగరంలో సమన్వయకర్త శ్రీనివాస్ బదులుగా ఎంపీ మార్గాని భరత్‌ను9Margani Bharat) బరిలో దింపాలనేది సీఎం యోచనగా చెబుతున్నారు. భరత్ మళ్లీ ఎంపీగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థి ఆయనే అని ఖరారైనట్లే అనే పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. అయితే ప్రస్తుత ఎంపీ ఒకరిని ఇక్కడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంటుందనేదానిపై సీఎం సర్వే చేయించడం కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో ప్రస్తుత సమన్వయకర్తలు బాచిన కృష్ణచైతన్య, వరికూటి అశోక్‌బాబులను మార్చాలంటూ ధర్నాలు జరిగాయి. వీరిలో ఒకరికి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మరొకరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు ఉంది.