Jagananna Thodu Funds Released: జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి రుణాలు మంజూరు సహా మాఫీ చేసిన వడ్డీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపుకార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఒక్కొక్కరికీ 10వేలు చొప్పున 3.95 లక్షల మందికి బ్యాంకుల ద్వారా కొత్తగా 395 కోట్లు కొత్త రుణాలు మంజూరు చేశారు. గత 6 నెలలకు సంబంధించిన 15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని సీఎం విడుదల చేశారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 3.67 లక్షల మంది రెన్యువల్గా రుణాలు తీసుకుంటుండగా..28 వేల మందికి కొత్తగా రుణాలిస్తున్నట్లు సీఎం తెలిపారు. జగనన్న తోడు కార్యక్రమం ద్వారా 15.31 లక్షల కుటుంబాలకు మంచి చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వ్యాపారాలు చేసుకునేందుకు ఏ ఒక్కరిపై ఆధారపడకుండా వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు 15 లక్షల 31 వేల 347 మందికి 2 వేల 406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్న సీఎం.. 8 లక్షల 74 వేల మంది తిరిగి రుణాలు పొందుతూ బ్యాంకులతో శభాష్ అనిపించుకుంటున్నారన్నారు. దేశంలో 39.21 లక్షల మందికి రుణాలు ఇస్తే 24 లక్షల 6 వేల రుణాలు మన రాష్ట్రంలో ఇచ్చామని, దేశ చరిత్రలోనే గొప్ప రికార్డు అని చెప్పడానికి తాను గర్వపడుతున్నానన్నారు. జగనన్న తోడు లబ్దిదారుల్లో 80 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారన్న సీఎం... ఎవరైనా లబ్ది పొందలేకపోతే ఆందోళన చెందకుండా తిరిగి దరఖాస్తు చేసుకుంటే అర్హతను పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.
జగనన్న తోడు పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం జగన్ కోరారు. రుణాలు సకాలంలో చెల్లించి వారికి 13 వేల వరకు రుణాన్ని పెంచేలా బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపారు. చిరువ్యాపారులు,హస్త కళాకారులు,సాంప్రదాయ చేతివృత్తుల వారు వాళ్ల కాళ్లపై వారు నిలబడేలా నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీన్ని నెరవేర్చడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: