CJI JUSTICE CHANDRACHUD : న్యాయవ్యవస్థలో సాంకేతికత అంతర్భాగమైందని.. సాంకేతిక పరిజ్ఞానం వాడకం వేగంగా పెరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని.. కాజ వద్ద నిర్మించిన జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించి.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టు: అనంతరం నాగార్జున వర్సీటీలో హైకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టును ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఆన్‌లైన్ సర్టిఫైడ్ కాపీల జారీకి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, న్యూట్రల్ సైటేషన్ ప్రారంభించారు. ఏపీ హైకోర్టు మొదటి వార్షిక నివేదికను సీజేఐ విడుదల చేశారు. ఈ-సర్టిఫైడ్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతోపాటు .. ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది: సాంకేతికత అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచుడ్ తెలిపారు. నూతన సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమైన ప్రక్రియ అని.. న్యాయవ్యవస్థ వేగంగా సేవలందించాలంటే మౌలిక వసతులు మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుందని వివరించారు. న్యాయవాదులు నల్ల కోటు ధరించడం, తెల్ల చొక్కాలపై నల్ల కోటు ధరించడాన్ని గమనించే ఉంటాం.. తెలుపు, నలుపు.. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలకు గుర్తుగా పరిగణిస్తారని పేర్కొన్నారు.
కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలి: నిత్య విద్యార్థులుగా ఉంటూ వృత్తి నైపుణ్యం పెంచుకోవాల్సి ఉందని తెలిపారు. వివాదాల పరిష్కారమే కాదు.. న్యాయాన్ని నిలబెట్టేదిగా ఉండాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని సూచించారు. న్యాయవ్యవస్థను పరిరక్షించడంలో అందరి సహకారం అవసరం అని పేర్కొన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని కోరారు. న్యాయమూర్తులకు సొంత సామర్థ్యాలపై విశ్వాసం ఉండాలని తెలిపారు. ముఖ్యమైన కేసుల్లో సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించాలి.
న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం ద్వారా లక్ష్యం సాధించవచ్చని సూచించారు.
"నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్-ఎన్‌జేడీజీ గణాంకాల ప్రకారం.. కోర్టు ప్రమేయం లేని పత్రాలు అందుబాటులో లేక దాదాపు 14లక్షల కేసుల్లో విచారణ జాప్యం అవుతోంది. న్యాయవాదులు అందుబాటులో లేక 63 లక్షలకు పైగా కేసులు ఆలస్యం అవుతున్నాయి. కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు బార్ కౌన్సిల్ సహకారం కూడా కావాలి. మార్పును, అందులోనూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. నేనూ నేర్చుకునే దశలోనే ఉన్నా. భవిష్యత్ అంతా సాంకేతికతదే. ఒకసారి నేర్చుకునే దశ దాటితే మొదట్లో పడిన కష్టాలు మరచిపోయి.. దాని వల్ల ఉపయోగాలేంటో గ్రహిస్తారు. ఇవాళ కోర్టు నుంచి భౌతికంగా ఎలాంటి దస్త్రాలు నా వద్దకు రావు. నా సిబ్బంది పరిశోధన పత్రాలన్నీ డిజిటల్‌గానే పంపుతారు. నా ఛాంబర్ కాగిత రహితం"-జస్టిస్ చంద్రచూడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ఇవీ చదవండి: