భవనంపై నుంచి జారిపడి సీఐ మృతి చెందిన ఘటన గుంటూరులో జరిగింది. నగరంలోని చంద్రమౌళినగర్లో నివాసం ఉంటున్న కాకర్ల శేషారావు (46) సీఐగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు పరిధిలోని వీఆర్‌లో ఉన్నారు. సీఐకు భార్య మధురవాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పండరీపురంలో నివాసం ఉండే గడ్డం ప్రసన్నలక్ష్మి అనే మహిళతో శేషారావుకి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మొన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ప్రసన్నలక్ష్మి నివాసంలోని మొదటి అంతస్తులో నిర్మిస్తున్న మెట్లపై ఉన్న బల్లిని తరిమే క్రమంలో సీఐ ప్రమాదవశాత్తు కాలు జారి మేడపై నుంచి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.