గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెదేపా జడ్పీటీసీ అభ్యర్థిని నాగభైరు విజయలక్ష్మీ వైకాపాలో చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజిని సమక్షంలో శుక్రవారం ఆమె భర్తతో కలిసి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చిలకలూరిపేట నుంచి వైకాపా జడ్పీటీసీ టికెట్ ఆశించగా.. అధిష్ఠానం ఆమెకు టికెట్ నిరాకరించింది. దీంతో తెదేపా తీర్థం పుచ్చుకుని బరిలో నిలిచి గెలిచారు. తాజాగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.
జడ్పీటీసీ నాగ భైరు విజయలక్ష్మి, ఆమె భర్త వెంకట్లు తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విజయలక్ష్మి, వెంకట్‌లను అద్దంకి వైకాపా ఇంఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య చిలకలూరిపేటలోని వైకాపా కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇద్దరికీ వైకాపా కండువాలు వేసి మంత్రి బాలినేని పార్టీలోకి ఆహ్వానించారు. మొదటి నుంచి కూడా ఇద్దరూ వైకాపా పార్టీ వారేనని, వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా హైదరాబాదులో సంబరాలు చేసుకున్నారని అన్నారు. ఎట్టకేలకు వారు తిరిగి సొంత గూటికి చేరడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి బాలినేని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని.. పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడని అన్నారు. అప్పట్లో అవకాశం కల్పించలేకపోయామని.. తిరిగి నాగ భైరు విజయలక్ష్మి సొంత పార్టీలోకి రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు.
తెదేపాకు ఝలక్..
తెదేపా నుంచి చిలుకలూరిపేటలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన నాగభైరు తాజాగా వైకాపాలో చేరడంతో తెదేపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరం మార్చిలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగవల్సి ఉండగా.. కరోనాతో ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎన్నికల సంఘం అప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో ఆమె తెదేపా నుంచి అభ్యర్థిగా ఖరారయ్యారు. తాజాగా ఆమె ఆ పార్టీని వీడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: తెదేపా కార్యకర్తలా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరు: ఎంపీ మోపిదేవి