Chandrababu Skill Development Case: స్కిల్ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై... అధికార పార్టీకి చెందిన నేతలు పలు ఆరోపణలు చేస్తూ వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ... చంద్రబాబుకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటూ అటు నిరసనల ద్వారా పోరాడుతూనే... మరోవైపు కోర్టుల్లోనూ న్యాయం కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా... స్కిల్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
విచారణ వాయిదా: స్కిల్ డెవలప్‌మెంట్(Skill development) కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు(Chandrababu) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబుపై కేసు నమోదుచేశారని చంద్రబాబు తరఫు న్యాయవాది గతంలో వాదనలు వినిపించారు.
ఆవుల ముని శంకర్ ముందస్తు బెయిల్ పిటిషన్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో (IRR Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు( Inner Ring Road Case )లో సీఐడీ దర్యాప్తులో భాగంగా... అరెస్ట్‌లు కొనసాగించేందుకు రంగ సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణ(Former minister Narayana) బావమరిది ఆవుల ముని శంకర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ ను ప్రస్తుతం అరెస్ట్ చేయమని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టు కు తెలిపారు. 41ఏ నిబంధనలను అనుసరిస్తామని సీఐడీ న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం అరెస్టు లేనందున పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ముగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసుపై నారా చంద్రబాబు, లోకేశ్‌ను సైతం ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
డాక్యుమెంట్స్ తీసుకురావడం సాధ్యం కాదు: సీఐడీ (CID) అధికారులు అడిగిన దస్త్రాలను దసరా పండగ తర్వాత తీసుకొని వస్తానని పేర్కొంటూ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేశ్ అధికారులకు లేఖ రాశారు. ఈరోజు ఉదయం 10 గంటలకల్లా తాము అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని నిన్న కిలారు రాజేశ్ కి సీఐడీ చెప్పింది. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టే సమయం కోరుతున్నట్లు రాజేశ్ లేఖలో తెలిపారు.