Chandrababu Powerpoint Presentation on YCP Sand Mafia: వైసీపీ నేతలు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి పాల్పడటం ద్వారా సీఎం జగన్ రూ.40 వేల కోట్లు సంపాదించారని విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా ఇసుక తోడేయడంతో ప్రకృతి విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు(TDP Chief Chandrababu) మండిపడ్డారు. ముడుపుల కోసమే వ్యాపార అనుభవం లేని జేపీ పవర్ వెంచర్స్‌కు ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారని విర్శలు గుప్పించారు. వాటాలో తేడా రావడంతో టర్న్ కీ సంస్థను బయటకు గెంటేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అనంతరం 2022 ఆగస్టు నుంచి వైసీపీ నేతలకే ఇసుక దందా అప్పగించారని వెల్లడించారు. ఇసుకలో వాటాల కోసం విచ్చలవిడిగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణ కోసం వ్యవస్థలను నాశనం చేశారనీ.. అందుకోసం నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. ఇసుక దోపిడీపై 48 గంటల్లో సమాధానం చెప్పాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇసుక రీచ్‌లో మీటర్ కంటే ఎక్కువ లోతు తవ్వకూడదనే ఎన్‌జీటీ నిబంధనలు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. నీరు ఉన్నచోట ఇసుకను తవ్వకూడదనే నిబంధన ఉందని.. అయినా, కృష్ణా నదిలోనూ రోడ్లు వేసి ఇసుకను తోడేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉన్నా కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్ని నిబంధనలు ఉల్లంఘించి కోట్ల టన్నుల ఇసుక దోపిడీ చేసేవారికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం ఇసుక అక్రమ తవ్వకాలపై కేసులు పెడితే... తవ్వకాలను నిలిపేయాలని ఎన్‌జీటీ తీర్పు ఇచ్చిందన్న చంద్రబాబు.. ఆదేశాలను పట్టించుకోక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ఇసుక రీచ్‌లతో పాటుగా... అనధికారికంగా 500కు పైగా ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా ఇసుకను నల్లబజారులో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు, మోసాలకు ఎందరో బలయ్యారని చంద్రబాబు పేర్కొన్నారు.
Sand Prices in AP: అక్రమార్కులకు ఇసు'కాసుల' పంట.. ప్రజల జేబులకు చిల్లు పెడుతూ అడ్డగోలుగా దోపిడీ..
రాజధాని అమరావతిలోనూ ఇసుకను వదలడం లేదని.. సీఎం ఇంటి దగ్గర గుండిమెడలో 3 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా... ఇసుక నిల్వచేసి దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక దోపిడీ కోసం నదులకు అడ్డంగా రోడ్లు వేస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా నుంచి చెన్నైకు ఇసుక పంపిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. తాగునీటి ఊటబావుల వద్ద కూడా ఇసుక తోడేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంత ఇసుక తవ్వారు.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నదులను, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమరాజ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇసు అక్రమ రవాణను ప్రశ్నించినందుకూ... రాజమండ్రిలో ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయినట్లు తెలిపారు. ఇసుక మాఫియాపై ప్రశ్నించే వారిని పలు రకాలుగా వేధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఇసుక అక్రమాలపై ఎన్‌జీటీకి వెళ్లినవారి ఆస్తులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ సేకరించిన ఇసుకను వేరే రాష్ట్రాలకు సైతం అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక రవాణకు సంబంధించి ఇచ్ఛాపురం నుంచి తడ వరకు అన్నీ నకిలీ వే బిల్లులను సృష్టిస్తున్నారని, తద్వారా జీఎస్టీని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. జీఎస్‌టీ ఎంత చెల్లించారు.. ఏ సంస్థ పేరున చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు.