Chandrababu Letter to Election Commission: రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై (Irregularities in Voter List) రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార పార్టీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు జరగడం లేదని అన్నారు.
మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయి: మాన్యువల్ ప్రకారం జనాభాపరమైన సారూప్య ఎంపికలు, ఫొటోగ్రాపిక్ సారూప్య ఎంపికలు పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలని అన్నారు. కానీ, ఓటర్ల జాబితాలో అనేక నియోజకవర్గాలలో ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తించబడుతూనే ఉన్నాయని విమర్శించారు. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు గుర్తించిన మరణాల సమాచారం, రాష్ట్ర డేటా బేస్‌లోని బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రార్ సమాచారం మేరకు ఈఆర్ఓలు (Electoral Registration Officers) మరణించిన వారి ఓట్లు తొలగించాలని తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తు డ్రాప్ట్ ఓటర్ లిస్టులో ఇప్పటికీ మరణించిన వారి ఓట్లు దర్శనమిస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు లేఖతో అధికారులపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం.. పలువురికి షో కాజ్ నోటీసులు
ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు: రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ – 1960 ప్రకారం ఓట్లను ఇంటి నంబర్ల ప్రకారం క్రమంగా ఉండేలా చూడాలి, కానీ నేటికి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అర్హత లేని వారికి సైతం ఫామ్ – 6 ద్వారా ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారం ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని, వీటిపై తమ అభ్యంతరాలపై నేటికి దృష్టి పెట్టలేదని అన్నారు.
భారీ మొత్తంలో దరఖాస్తులను స్వీకరించరాదు: డైరెక్ట్‌గా గానీ, ఆన్‌లైన్‌లో గానీ బల్క్ ఫామ్-7 దరఖాస్తులను స్వీకరించరాదని కోరారు. ఓటుపై అభ్యంతరం లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు ఖచ్చితంగా ఆధారాలు చూపించాలన్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఎటువంటి విచారణ చేయకుండా తెల్ల పేపర్‌పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారన్నారు. నేటికి ఈఆర్ఓలు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తూ ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
ఓటర్ల మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సందర్బంగా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. డ్రాప్ట్ ఓటర్ లిస్టు ప్రకటించి నెల గడుస్తున్నా పైన పేర్కొన అనేక అభ్యంతరాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఫైనల్ లిస్తులో ఓట్ల అవకతవకలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఈఆర్ఓలకు, డీఈఓలకు నిర్ణీత సమయానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు లక్ష్యంగా వైసీపీ అక్రమాలు- ఫేక్ ఓటరు ఐడీతో తొలగింపు