Chandrababu Speech in Mahashakthi: తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆడబిడ్డల వంక కన్నెత్తి చూడలేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నాయకుడు సక్రమంగా ఉంటేనే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్టంలో నాలుగు సంవత్సరాలుగా ఉన్మాది పాలన సాగటం వల్ల, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మహాశక్తి చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. మహిళల కోసం ప్రకటించిన 'మహాశక్తి'పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి.. అన్ని నియోజకవర్గాల నుంచి మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఎప్పుడు.. ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి: నాలుగు సంవత్సరాలలో 52 వేల 587 దాడులు, అఘాయిత్యాలు జరిగాయని, 22 వేల 278 మంది మహిళలు కనిపించకుండా పోయారని, 3వేల 372 మందిపై అత్యాచారాలు జరిగాయని, 41 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. ఏ సైకో వస్తాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇంట్లో పడుకున్నా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు. ఎప్పుడు ఎవరు వచ్చి యాసిడ్ పోస్తారో తెలియదని మండిపడ్డారు.
వారికే ఆలోచనా శక్తి ఎక్కువ: మగవారి కంటే మహిళలకే ఆలోచనా శక్తి ఎక్కువ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మగవారి కంటే మహిళలకే తెలివితేటలు ఎక్కువని.. ఇప్పుడు మహిళలే మగవారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. ఒకప్పుడు కుమార్తె పెళ్లి చేయాలంటే కట్నంపై ఆలోచించేవారని.. ఇప్పుడు కట్నం గురించి ఎవరూ ఆలోచించట్లేదన్నారు. పెద్దగా చదువుకోని మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని.. మహిళల్లో పొదుపు శక్తిని పెంచామన్నారు. మహిళల ప్రోత్సాహకానికి ఎన్నో కార్యక్రమాలు తెచ్చామన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పానని.. ఇప్పుడు మళ్లీ పిల్లలను కనాలని సూచిస్తున్నా అని చంద్రబాబు చెప్పారు.
అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఆడపిల్లలకు భరోసా: ఆడపిల్లల పేరుతో అప్పట్లోనే నగదు డిపాజిట్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. స్పీకర్‌గా మహిళకు అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని స్పష్టం చేశారు. మహిళలకు డబ్బు సంపాదించే మార్గం చూపిన పార్టీ తెలుగుదేశం అన్నారు. మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన తొలిపార్టీ తెలుగుదేశం అన్నారు. గ్యాస్ ధరలు పెరిగాయని.. మళ్లీ కట్టెల పొయ్యిల రోజులు వచ్చాయన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
వాటి గురించి వాలంటీర్లకు ఎందుకు: ఆడబిడ్డల సంబంధాల గురించి వాలంటీర్లకు ఎందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. చెప్పుతో కొట్టేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు గడప గడపకు తిరిగే పరిస్థితి లేదని చంద్రబాబు విమర్శించారు.
చంద్రబాబు మానవత్వం: బండిపై నుంచి పడిపోయిన ఇద్దరు మహిళలను చూసి వెంటనే చంద్రబాబు తన కాన్వాయ్ ఆపి.. వారికి ప్రాథమిక చికిత్స చేయించారు. తాడేపల్లి మండలి సీతానగరం వద్ద ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వెళుతూ దారిలో జరిగిన ప్రమాదాన్ని చూసి స్పందించారు. కారు దిగివచ్చి మహిళను పరామర్శించారు. కాన్వాయ్‌లో అందుబాటులో ఉన్న డాక్టర్ ద్వారా.. మహిళకు వైద్యం అందించారు. మహిళతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మహిళలను కారులో ఇంటివద్ద దిగబెట్టి రావాలని సిబ్బందిని ఆదేశించారు.