రాష్ట్రంలో అధికారం మారిన దగ్గర నుంచీ... తెదేపాపై దాడులు పెరిగిపోయాయని... తమ కార్యకర్తలను గ్రామాల్లోనూ ఉండనీయడం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. గురజాల నియోజకవర్గంలోని ఆత్మకూరులో వైకాపా దాడులకు తమ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని... ఊరిలో కాలు పెట్టకుండా తరిమేస్తున్నారని చెబుతోంది. ఊరు దాటి బయట తలదాచుకుంటున్న కార్యకర్తలతో... తెదేపా గుంటూరులో వైకాపా బాధితుల శిబిరం నిర్వహించింది.
కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న శిబిరాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా... పలువురు నేతలు సందర్శించారు. వైకాపా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు... తెదేపా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రాబాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాను ముందు నిలబడతానని.. కేసులు పెట్టుకోవాలని సవాలు చేశారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం స్పందించింది. తెదేపా పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టిస్తోందిని రాష్ట్ర హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. హోంమంత్రి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఇదే సమయంలో వైకాపా నేతలు స్పందించారు. తమ కార్యకర్తల మీద తెదేపా పాలనలో జరిగిన దాడులు... బాధితులతో తామూ ఛలో ఆత్మకూరు నిర్వహిస్తామని ప్రకటించారు. తమ కార్యక్రమానికి అనుమతివ్వాలని గుంటూరు రేంజ్ ఐజీని కలిసి విజ్ఞప్తి చేశారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రకటనలతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే గురజాలలో 144 సెక్షన్ విధించారు. తెదేపా వైకాపా పోటాపోటీగా ఆత్మకూరు పర్యటనకు పిలుపునిచ్చిన కారణంగా... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికార, విపక్షాల సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురజాల నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.
ఇదీ చదవండి