Central Panchayat Raj Department Inquiry on Panchayat Funds in AP: విద్యుత్తు ఛార్జీల బకాయిలకు ఆర్థిక సంఘం నిధులు చెల్లించేందుకు కేంద్రమే అనుమతించిందని చెబుతూ పంచాయతీలకు ఇచ్చిన కోట్ల రూపాయలు మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బయటపడింది. ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి పరిపాలన ఖర్చులకు నిర్దేశించిన 10 శాతంలోనే విద్యుత్తు బకాయిలకు చెల్లించాలి. సగటున 24శాతం వరకు మళ్లించగా కొన్ని పంచాయతీల్లో 80 నుంచి 90 శాతం వరకూ మళ్లించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మూడేళ్లుగా రోడ్లెక్కి సర్పంచులు చేస్తున్న ఆందోళన, ఆక్రందనలు, నిధుల మళ్లింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమని కేంద్రానికి ఇప్పటికి అర్థమైంది. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా పంచాయతీలకు కేటాయిస్తున్న నిధులను విద్యుత్తు బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఉప కార్యదర్శి విచారణలో నిర్ధారణ అయింది.
ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందన్న ఫిర్యాదులపై ఉప కార్యదర్శి విజయకుమార్ బుధ, గురువారాల్లో కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని ఐదు పంచాయతీల్లో విచారణ చేపట్టారు. ఆర్థిక సంఘం నిధుల్లో సింహభాగం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లించినట్లు ఆయన గుర్తించారు. కేంద్రం 2019-20 నుంచి 2022-23 మధ్య రాష్ట్రానికి 6వేల 2వందల ఒక కోటి 88 లక్షల రూపాయల ఆర్థిక సంఘం నిధులు కేటాయించింది. ఇందులో నుంచి 15 వందల కోట్లకు పైగా పంచాయతీల విద్యుత్తు ఛార్జీల బకాయిల రూపేణా డిస్కంలకు చెల్లించింది. సర్పంచుల అనుమతి తీసుకోకుండా పంచాయతీల పీడీ ఖాతాల్లో నుంచి మొదటిసారి దాదాపు 12 వందల 50 కోట్లను సర్దుబాటు చేసింది.
సర్పంచులు ఆందోళనకు దిగడంతో పంచాయతీరాజ్‌శాఖ నుంచి మరో 2 వందల 50 కోట్లు చెల్లించింది. ఆర్థికసంఘం నిధుల వ్యయంపై పూర్తి హక్కు సర్పంచులకే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారిని విస్మరించి పెత్తనం చెలాయించింది. విద్యుత్తు బకాయిలకు ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి చెల్లించొచ్చని కేంద్రం అనుమతిచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ నిబంధనల ప్రకారం గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతరత్రా పనులకు మొదట ప్రాధాన్యమివ్వాలి. ఆ తర్వాతే విద్యుత్తు ఛార్జీల బకాయిలకు వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని తుంగలో తొక్కి నేరుగా డిస్కంలకు చెల్లించింది. ప్రభుత్వమే చెల్లించడంతో పంచాయతీ కార్యాలయాల్లో రసీదులేవీ లేవు. దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బకాయిలకు మళ్లించి పంచాయతీలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. గతంలో ఇవే నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధిదీపాల వంటి సమస్యలను సర్పంచులు వెంటనే పరిష్కరించేవారు. నిధుల్లేకపోవడంతో మూడేళ్లుగా పంచాయతీల్లో దయనీయమైన పరిస్థితి నెలకుంది. చిన్నాచితకా సమస్యలు కూడా పరిష్కరించలేకపోతున్నామని పలువురు సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు ఉప కార్యదర్శి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంలకు మళ్లించిన నిధుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఉప కార్యదర్శికీ చెప్పట్లేదు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై వివరాలివ్వాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇటీవల అడిగిన ప్రశ్నకూ ప్రభుత్వం వివరాలివ్వలేదు. నిధుల మళ్లింపు ప్రశ్నే ఉత్పన్నం కాదని ఎమ్మెల్యేలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది. అటు.. సర్పంచుల ఆందోళనల్లో నిజముందని ఎట్టకేలకు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.