Central Government Officials Met With CM Jagan: తుపాను కరవుతో నష్టపోయిన రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర బృందాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు సిఫార్సు చేయాలన్నారు. తుపాను వల్ల సంభవించిన కరవులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ధాన్యం నమూనాల సేకరణ
సచివాలయాల రూపంలో బలమైన వ్యవస్థ: రాష్ట్రంలో వర్షాభావం, తుపాను, కరవు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన రెండు అధికారుల బృందాలు, క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలపై జగన్‌తో కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించి తాము చూసిన పరిస్థితుల గురించి వివరించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యల గురించి సీఎం జగన్ వివరించారు. తుపాను ప్రభావాన్ని ముందుగానే గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని తెలిపారు. గ్రామస్థాయిలో సచివాలయాల రూపంలో బలమైన వ్యవస్థ ఉందని జగన్ పేర్కొన్నారు. అదే విధంగా పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
కరవు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - ఆర్థిక సాయంపై హామీ
గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్: ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు. తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించిన సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపారు. తమ రాష్ట్రంలో ఇ - క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామన్నారు. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. రైతులను తుది వరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్నారు.
ఏడు జిల్లాల్లోని పరిస్థితుల గురించి అధ్యయనం: మిగ్‌జాం తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాల వల్ల పాడవడంతో అన్నదాతలకు కన్నీళ్లే మిగిలాయి.తుపాను వల్ల రాష్ట్రంలో ఏర్పడిన పంట నష్టం, కరువు పరిస్థితులపై రెండు బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటలను అధ్యయనం చేశారు. అనంతపురం జిల్లా నుంచి ప్రారంభమైన పర్యటన మొత్తం ఏడు జిల్లాల్లో తిరిగి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశారు.