మహిళా దినోత్సవ వేళ అమరావతి స్త్రీలకు రోదనలే మిగిలాయి. ఉద్యమ ఉద్వేగం, పోలీసుల మోహరింపుతో రాజధాని అట్టుడికిపోయింది. శాంతియుత ఆందోళనపై ఉక్కుపాదంతో గృహిణులు కన్నీటి పర్యంతమయ్యారు. దైవ దర్శనానికి బయల్దేరిన వారిని ముళ్లకంచెలు, బారికేడ్లతో పోలీసు బలగాలు నిలువరించడం తోపులాటలకు దారితీసింది. కిందపడి గాయాలపాలైన మహిళలు.. రాక్షస పాలనకు విముక్తి ఎప్పుడంటూ శాపనార్థాలు పెట్టారు.
రాజధాని గ్రామాల్లో ఉద్యమ వేడి...
మహిళా దినోత్సవ వేళ రాజధాని గ్రామాల్లో ఉద్యమ వేడి రగిలింది. మహిళల కవాతు, పోలీసుల దిగ్బంధంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దుర్గమ్మ దర్శనానికి వెళ్లేందుకు మహిళలు తలపెట్టగా.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు మహిళలు గాయపడ్డారు. రాయపూడి నుంచి పాదయాత్ర చేపట్టిన మహిళలు సీడ్ యాక్సిస్ రోడ్డును దిగ్బంధించారు. మందడంలోనూ మహిళలను పోలీసులు అడ్డుకోవడం సహా.. మల్కాపురం, వెలగపూడి కూడలి వద్ద ముళ్లకంచెలు వేశారు. పోలీసుల అణచివేతపై ఉద్వేగానికి గురై పలువురు అతివలు రోదించారు.
బారికేడ్లతో అడ్డగింత...
వెలగపూడిలో సచివాలయం వైపు వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా.. పోలీసులు బారికేడ్లతో అడ్డగించారు. తోపులాటలో పలువురు కిందపడ్డారు. రోడ్డుపైనే వడ్డించిన అన్నం తిని మహిళలు నిరసన తెలిపారు. మందడం శివాలయం సెంటర్లో పలువురు పురుగుల మందు తాగేందుకు యత్నించగా.. పోలీసులు నివారించారు. అంతకుముందు ఉదయాన్నే ప్రకాశం బ్యారేజీపై పలువురు మహిళలు బైఠాయించారు. పోలీసులు బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కించి అక్కడినుంచి తరలించారు.
అవనిగడ్డలో నిరసన...
రాజధాని మహిళలపై పోలీసుల అరెస్ట్‌కు నిరసనగా కృష్ణాజిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం: పవన్ కల్యాణ్
అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేళ రాజధాని ప్రాంత మహిళలపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న మహిళలు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించి, అరెస్టులు చేసిన విధానం అవమానకర రీతిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పట్ల మగ పోలీసులు ఎంత అవమానకరంగా ప్రవర్తించింది మహిళలు కన్నీళ్లతో చెబుతున్నారన్నారు. దైవ దర్శనం కోసం వెళ్తున్నవారిని అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయని ప్రశ్నించారు. అమరావతి మహిళలకు అమ్మవారిని దర్శించుకునే హక్కు లేదా అని నిలదీశారు.
ఇదీ చదవండి:వైకాపా అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు