మన అమరావతి... మన రాజధాని నినాదంతో తెనాలి మార్కెట్ సెంటర్లో అఖిలపక్ష జేఏసీ నిర్వహిస్తోన్న నిరసన దీక్షలు ఏడో రోజుకు చేరాయి. వారికి మద్దతుగా పట్టణంలోని ప్రముఖ వైద్యులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాజధాని మార్పు చేయడం సరికాదని వారు అన్నారు. ప్రజలందరూ ఉద్యమంలో పాల్గొనాలని వైద్యులు సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘం తరఫున ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెనాలిలో అఖిలపక్ష జేఏసీ తరఫున ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.
రోడ్లపైకి రైతులు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ మంగళగిరి మండలం ఎర్రబాలెం, తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతితోనే తమ భవిష్యత్ ముడి పడి ఉందని రైతులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తన మనస్సు మార్చుకొని అమరావతే రాజధాని అని ప్రకటన చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:రాజధాని కోసం రోడ్డెక్కిన చిన్నారులు