Amaravathi Lands: రాజధాని భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిఆర్ శెట్టి సంస్థకు కేటాయించిన భూముల వద్ద బైఠాయించి.. నినాదాలు చేశారు. రాజధానిలో నిర్మాణాల్లేకుండా భూములు అమ్మడం సరికాదన్న రైతులు.. వెంటనే సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏంపీలు, మంత్రులు మూడు రాజధానులని ఇప్పటికే ప్రకటనలు చేశారని.. ముందుగా వారితోనే జగన్ స్వయంగా అమరావతే పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రకటించిన తర్వాతే ఈ ప్రాంతంలోకి రావాలని స్పష్టం చేశారు.
ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాతే.. ఇక్కడి భూముల గురించి ప్రభుత్వం ఆలోచించాలని రైతులు హెచ్చరించారు. రాజధానిని అభివృద్ధి చేయకుండా ఇష్టానుసారం భూములు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా భూములు అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదు. ఈ మేరకు రైతులతో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మొండిగా ముందుకెళ్తే.. న్యాయస్థానంలో మరోసారి భంగపాటు తప్పదు. -ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి
అమరావతి భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని తెలుగుదేశం నేత లోకేశ్ విమర్శించారు. ముంపు ప్రమాదం ఉందని, శ్మశానం అంటూ తప్పుడు ప్రకటనలు చేసిన ప్రభుత్వ పెద్దలు... ఇప్పుడు ఎకరం 10 కోట్లు చొప్పున ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వం అమరావతిని చిన్నాభిన్నం చేసేందుకు అనేక కుట్రలు చేస్తోందని సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూములను అమ్మే జీవో 389 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు త్యాగం చేసిన భూములను.. ప్రజాప్రయోజనాలకే ఉపయోగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: