Capital Farmers Reject The CRDA Notices : అధికారం మాది.. ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. నిబంధనలతో పని లేదు, చట్టాలను అనుసరించాల్సిన అవసరం లేదనే రీతిలో రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం నడుచుకుంటోంది. మూడు రాజధానుల ప్రకటన మెుదలుకుని తాజాగా సీఆర్డీఏ చట్టాన్ని సవరణ వరకూ భూములిచ్చిన రైతుల అభిప్రాయం తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వం, CRDA అధికారుల తీరుకు వ్యతిరేకంగా రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మాస్టర్ ప్లాన్‌కు భిన్నంగా వెళ్లొద్దని హైకోర్టు తీర్పు చెప్పినా.. ప్రభుత్వం చట్ట సవరణ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నఅంశాలపై ముందుకెళ్లొద్దని పంచాయతీ అధికారులకూ వినతిపత్రాలు అందజేశారు.
రాజధాని రైతులు విజయవాడ సీఆర్డీఏ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అన్నదాతల నుంచి వేలాది అభ్యంతరాలు రావటంతో అధికారులు స్పందించారు. CRDA చట్ట సవరణపై అభ్యంతరాలు చెప్పాలని ఐదు గ్రామాల రైతులకు నోటీసులిచ్చారు. మంగళవారం నోటీసులు అందజేసేందుకు సీఆర్డీఏ అధికారులు రాజధాని గ్రామాలకు రాగా.. తీసుకునేందుకు అన్నదాతలు ససేమిరా అన్నారు. తమ గ్రామాల్లో సభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు తేల్చి చెప్పారు.
CRDA చట్టంలో ప్రభుత్వం, రైతులు భాగస్వాములు. అలాంటిది తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చట్టాన్ని ఎలా మారుస్తారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. సీఆర్డీఏ చట్టంలో ఆర్-5 జోన్ ఏర్పాటు కోసం అత్యుత్సాహం ప్రదర్శించడం చట్టవిరుద్ధమన్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన వారే అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ దాఖలు చేసింది. ఇది పెండింగ్‌లోనే ఉంది. అయినా ఆర్-5 జోన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవటాన్ని రైతులు తప్పుబడుతున్నారు.
రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు లేనందున.. గ్రామ సభల ఆమోదం పొందిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలి. అభ్యంతరాలు చెప్పేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 11వరకు మాత్రమే గడువు ఉంది. గ్రామ సభలపై ప్రభుత్వం, సీఆర్డీఏ నుంచి సానుకూల స్పందన రాకుంటే హైకోర్టులో పిటిషన్ వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి: