రాజధాని గ్రామాల్లో 85వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అమరావతి రాజధానిగా కొనసాగించాలని.. మూడు రాజధానులు వద్దంటూ.. రాజధాని రైతులు, మహిళలు గళమెత్తారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, కృష్ణాయపాలెంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మందడంలో అమరావతి పరిరక్షణార్ధం మణిద్వీప వర్ణన పూజా కార్యక్రమం నిర్వహించారు. మూడు గంటల పాటు మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కృష్ణా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొన్నారు. తుళ్లూరులో రైతులు రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని రైతులు చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: 'మేము ఒక్క క్షణం ఆగి ఉన్నా మమ్మల్ని చంపేసేవారు'