Building Construction Workers: జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భవన నిర్మాణ కార్మికులను అతలాకుతలం చేసేస్తోంది. కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వచ్చీ రాగానే 'కొత్త ఇసుక విధానం' పేరుతో రీచ్‌లు మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేసింది. నిర్మాణ పనులు ఆగిపోయేలా చేసి, కార్మికుల కడుపు కొట్టింది. నిర్మాణ సామగ్రి ధరలు, ఇతర ఖర్చు పెరగడం, వ్యాపారం మందగించి పనులు లేక కూలీల కుటుంబం గడవటమే కష్టంగా మారింది.
పనుల్లేని కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వని ప్రభుత్వం భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న నిధులను ఇతర వాటికి మళ్లించేస్తోంది. గతంలో వీరి కోసం ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలను ఎత్తేసింది. నవరత్నాల్లో కలిపేసి ఏవీ అందకుండా చేసింది. కార్మికుల సంక్షేమ బోర్డునూ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్న పన్ను నిధులను వైఎస్సార్ బీమాకు వాడేసుకుంటోంది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా వారికి బోర్డు ఇచ్చే ప్రయోజనాలను కొనసాగించాయి. కానీ జగన్ అనాలోచిత నిర్ణయాలతో పస్తులుండాల్సి వస్తోందదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణదారుల నుంచి వసూలు చేసే ఒక శాతం పన్ను డబ్బులతో ప్రభుత్వం కార్మికులకు సంక్షేమాన్ని అమలు చేయాలి? కానీ, నవరత్నాలు ఇస్తున్నామంటూ ఆ డబ్బులను ఇతర పథకాలకు వాడేస్తోంది.
టీడీపీ హయాంలోని పథకాలను వైసీపీ నిలిపివేసింది: భవన నిర్మాణ కార్మికులు
గత నాలుగేళ్లుగా వైఎస్సార్ బీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నిధులు వాడుకోగా ఈ ఏడాది ప్రీమియం చెల్లిచకుండా పరిహారం డబ్బులను ఈ నిధులతోనే బాధితులకు చెల్లిస్తోంది. ప్రీమియానికి, పరిహారం చెల్లింపునకు మధ్య వ్యత్యాసం లేకపోవడంతో ప్రీమియం చెల్లించకుండా నేరుగా క్లైయిమ్స్ చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ బోర్డులో 19లక్షల 96వేలకు పైగా కార్మికులు నమోదయ్యారు. వీరిలో నవరత్నాల కింద లబ్ధి పొందుతున్న వారు 15 లక్షలలోపే. ఈ లెక్కన దాదాపు 5లక్షల మందికి అటు నవరత్నాలు, ఇటు బోర్డు సంక్షేమ పథకాలూ అందడం లేదు.
చట్టం ప్రకారం అందించాల్సిన వాటినే ఎగ్గొటే సీఎం జగన్ ప్రతి సభలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ వారిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. బోర్డుకు సంబంధించిన పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఎవరు చనిపోయినా సంక్షేమ బోర్డు నుంచి బీమా పరిహారం వస్తుంది. కానీ, వైఎస్సార్ బీమాలో కుటుంబ పెద్ద చనిపోతేనే బీమా ఇస్తారు.
కొన్నిచోట్ల భార్యాభర్తలు, వారి పిల్లలు భవన నిర్మాణ కూలీలుగా పని చేస్తున్నారు. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా వస్తుంది. మిగతా వారికి వైఎస్సార్ బీమా వర్తించడం లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా వారికి ఏదో మేలు చేస్తున్నామన్నట్లు ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో సుమారు 50వేల క్లైయిమ్స్ పెండింగ్‌లో ఉన్నా బోర్డు నుంచి ఇవ్వడం లేదు. దీనిపై ఇటీవల కార్మికులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినా ఆశించిన స్పందన కరవైంది.
యజమాని కాకుండా కుటుంబంలోని ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడితే గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు. ఇప్పుడు వైఎస్సార్ బీమా వల్ల యజమానికి తప్ప ఇతరులకు పరిహారం రాని పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులకు వైఎస్సార్ కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చింది. దీంతో 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేలాది మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి ఎలాంటి సహాయం అందలేదు.
ఈ సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఇందులో రూ.40వేలు నిర్మాణ కార్మికులకు బోర్డే చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న పథకం కింద యువతులు పదో తరగతి చదవి ఉండాలన్న నిబంధన పెట్టింది. పనులు కల్పించలేని జగననన్న సర్కార్ ప్రమాదం జరిగినా అండగా ఉండటంలోనూ విఫలమైంది.
సంక్షేమ బోర్డులో 2వేల 500కోట్ల రూపాయలకు పైగా నిధులు ఉండగా కార్మికుల కోసం ఈ నాలుగేళ్లలో కేవలం 700కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు చేసింది. నిబంధనల ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వారి కోసమే ఖర్చు చేయాలి. కానీ వైఎస్సార్ బీమా పథకానికి ఏటా 200కోట్ల రూపాయల వరకు వాడేస్తోంది. రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్‌లో 750కోట్ల రూపాయల డిపాజిట్ చేయించింది.
వడ్డీ ఇస్తున్నామని చెబుతున్నా దాంతో ఏ కార్యక్రమాలనూ చేస్తున్న దాఖలాలే లేవు. కరోనా మొదటి దశలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద 5వేల వంతున సాయం చేస్తామని పేర్కొంది. రాష్ట్ర కార్మిక శాఖ సైతం వివరాలు సేకరించింది. దీనికి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఒక్కరికి కూడా పైసా సాయం అందలేదు.