ఎస్‌ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరువు రోడ్డు మీద పడిందని భాజపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శించారు. గతంలో కూడా కోర్టులు అనేక తీర్పులిచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. అలాగే రమేశ్ కుమార్ వ్యవహారంలో గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని వుంటే బాగుండేదని సుజనా చౌదరి అన్నారు. వైకాపా నేతలు తమ ప్రభుత్వ చర్యలపై ఆత్మావలోకనం చేసుకోవాలని... బ్యూరోక్రాట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం పనిచేస్తే కేంద్రం, తరువాత వచ్చే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోబోవని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెదిరించి పాలన చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని రాజ్యసభ్యుడు సీఎం రమేష్ అన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు అనుకూలంగా తీర్పు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రమేశ్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం... గవర్నర్ వ్యవస్థను సైతం అవమానపర్చే విధంగా వ్యవహరించిందన్నారు. గవర్నర్ సైతం ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్డినెన్స్ తెచ్చినా దానిని న్యాయ నిపుణులతో చర్చించాలన్నారు.