రేపు మరోసారి ఛలో రామతీర్థం నిర్వహించాలని భాజపా-జనసేన నిర్ణయించాయని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రామతీర్థం ఘటన, సోము వీర్రాజు అరెస్టుకు నిరసనగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. వైకాపా, తెదేపా నేతలను రామతీర్థానికి అనుమతించి భాజపా నేతలను అడ్డుకోవడం, గృహనిర్బంధాలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. వైకాపా వచ్చాక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరవైందని.... ప్రతిపక్షాల గొంతును పోలీసులతో నొక్కిస్తున్నారని ఆరోపించారు. హిందూమతం పట్ల రాష్ట్రప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
మతమార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయి
దేవాలయాలపై వరుస దాడులు వెనుక రాష్ట్రప్రభుత్వం అండదండలున్నాయని కన్నా ఆరోపించారు. 127 ఘటనలు జరిగితే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మంత్రులు ఎదురుదాడులు చేస్తూ తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో మతమార్పిడులు యథేచ్చగా సాగుతున్నాయని... మతమార్పిడులను రాష్ట్రప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ....రాష్ట్రంలో ఎక్కడ... ఏం అభివృద్ధి చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
భాజపా, భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తలకు మధ్య వివాదం
గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా శ్రేణులు, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తలకు మధ్య వివాదం తలెత్తింది. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేసి రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు నిరసనగా బీజేపీ ధర్నా చేపట్టగా... పక్కనే రైతుల నిరసన శిబిరం నుంచి మోదీ డౌన్ డౌన్ నినాదాలు చేయడంతో వివాదం తలెత్తింది. ఒక్కసారిగా భాజపా కార్యకర్తలు భారతీయ కిసాన్ సంఘ్ నిరసనకారులపైకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాల మధ్య తోపులాట ఏర్పడగా.... పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు .
ఇదీ చూడండి. 'అక్కను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు'