Rajagopal Reddy on TRS won munugode: ప్రజలంతా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను తెరాస పార్టీ దుర్వినియోగం చేసిందని అభిప్రాయపడ్డారు. ప్రచారం సమయం ముగిసిన తర్వాత కూడా ఇతర ప్రాంత తెరాస నేతలు నియోజకవర్గంలోనే ఉన్నారని విమర్శలు చేశారు.
మునుగోడులో నైతికంగా నాదే విజయం. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిపి 100 మందికి పైగా మోహరించారు. ఒక్కడినే కౌరవ సైన్యాన్ని తట్టుకుని పోరాడాను. తెరాస విజయం అధర్మ గెలుపు. తెరాస ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలకు పాల్పడింది. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ నిధులు బ్యాంకు ఖాతాల్లో వేసి ప్రలోభపెట్టారు. తెరాసకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తామని మంత్రి బెదిరించారు. దుర్మార్గమైన పద్ధతిలో తెరాస గెలిచింది. - - రాజగోపాల్‌రెడ్డి, భాజపా అభ్యర్థి
మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో ఎంతో పోరాటం చేశానని రాజగోపాల్ పేర్కొన్నారు. ఫామ్‌హౌస్ పాలకులు, ప్రగతిభవన్ నేతలను మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తీసుకొచ్చానని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని తెలిపారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు తెరాసకు అమ్ముడుపోయాయని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి..