Bhavishyathu Ku Guarantee Bus Yatra : టీడీపీ మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు, విధ్వంసాన్ని జనాలను వివరించే లక్ష్యంతో చేపట్టిన బస్సు యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. తాడికొండ నియోజకవర్గంలో శనివారం టీడీపీ నేతలు పర్యటించారు. తుళ్లూరు మండలం అనంతవరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు.
తుళ్లూరు మండలంలో ఉన్న టిడ్కో గృహ సముదాయాలు పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. టీడీపీ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తిచేస్తే, జగన్ మోహన్ రెడ్డికి నాలుగేళ్ల పాలనలో మిగతా పది శాతం కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా అక్కడ లబ్దిదారులు నివశించే పరిస్థితి లేదన్నారు. టిడ్కో భవనాల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. జగన్కు కూలగొట్టడం తప్ప నిర్మించటం చేతకాదన్నారు. ఆ తర్వాత నెక్కల్లులో బ్రహ్మకుమారి కేంద్రాన్ని సందర్శించారు.
అనంతరం పెదపరిమిలోని కళ్యాణ మండపంలో సభ ఏర్పాటు చేశారు. టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. వారు అడిగిన సందేహాలు నివృత్తి చేశారు. సంపద సృష్టించటం తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని.. అందుకే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి రాజధాని పరిధిలో జరిగిన నిర్మాణాలను టీడీపీ బృందం పరిశీలించింది. ఐనవోలులో విట్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పడిన విశ్వవిద్యాలయం వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అలాగే నేషనల్ ఇనిసిట్యూట్ ఆఫ్ డిజైన్ నిర్మాణం ఆగిపోవటం వల్ల భవనాలు వినియోగంలోకి రాని పరిస్థితిని పరిశీలించారు.
నేలపాడులో నాలుగో తరగతి ఉద్యోగులు, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, న్యాయమూర్తుల గృహాల్ని పరిశీలించి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అలాగే లింగాయపాలెంలో రహదారులు తవ్వేసి కంకర, మట్టి తరలించి అమ్ముకున్న తీరుని చూసి మండిపడ్డారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల వద్ద కూడా సామాగ్రి చోరీ చేస్తున్నారని.. అధికారపార్టీ నేతల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతం వద్ద సెల్పీలు దిగారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాల్సిన అమరావతిని జగన్ తన మూర్ఖత్వంతో నాశనం చేశారని ఆరోపించారు.
రాజధాని ప్రాంత రైతులు టీడీపీ బస్సుయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం వేగంగా జరిగిందని.. తమ భవిష్యత్తు బాగుంటుందని భావించిన తరుణంలో జగన్ వచ్చి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి రాజధానిగా కొనసాగటం అనేది రాజకీయ నిర్ణయమన్న రైతులు.. చంద్రబాబు వస్తేనే అది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణం జరగాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు.
బస్సు యాత్రలో భాగంగా చివర్లో తుళ్లూరు మండల కేంద్రంలో రచ్చబండ నిర్వహించారు. తాము ఉదయం నుంచి పరిశీలించిన అంశాలు ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'వేల స్టాఫ్ క్యార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక రావడానికి సరైన రహదారులు లేవు. హైకోర్టుకు వెళ్లడానికే సరైన రహదారులు లేవన ఆవేదన చెందుతున్న పరిస్థితి. జగన్ విధ్వంసం ఒకవైపు..చంద్రబాబు అభివృద్ధి మరోవైపు ఈ ప్రాంతంలో కళ్లకు కట్టినట్లు కనపడతున్నాయి.'-ధూళిపాళ్ల నరేంద్ర, టీడీపీ సీనియర్ నేత