Balapur Ganesh Laddu Auction 2023 : ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu) వేలంపాట. ఇక్కడి లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు.. వేలంపాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటోంది. లడ్డూను ఎవరు దక్కించుకుంటే వారింట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలిచే గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Balapur Ganesh Laddu History : 28 ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోన్న లడ్డూ వేలంపాట.. 1994లో రూ.450తో మొదలైంది. ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంటుంది. గతేడాది స్థానికుడైన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24,60,000లు లడ్డూను దక్కించుకున్నారు. 2001వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది.
2002లో కందాడ మాధవరెడ్డి పోటీపడి రూ.1,05,000కు లడ్డూ దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చింది. 2007లో స్థానికుడు రఘునందనచారి రూ.4,15,000కు పాటపాడి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో బాలాపూర్ లడ్డూ రూ.10 లక్షలు దాటి రికార్డు సృష్టించింది. కల్లెం మదన్ మోహన్ రెడ్డి రూ.10,32,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2016లో నాలుగు లక్షలు పెరిగింది.
Balapur Ganesh : ఆ సంవత్సరం మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000కు కైవసం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15,60,000కు పొందగా.. 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16,60,000కు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి 17,60,000 పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.
Silver Ganesh Idol in Nizamabad : వెండి పత్రాలతో ఆకట్టుకుంటున్న వినాయకుడి విగ్రహం
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి.. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. 2021 ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్.. నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి రూ.18,90,000కు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఏటా రెండు నుంచి మూడు లక్షలు పెరుగుతుందనుకున్న లడ్డూ ధర.. 2022లో ఏకంగా ఐదు లక్షలు పెరిగి రికార్డు సృష్టించింది. దీంతో గతేడాది రూ.24,60,000లు పలికి మరోసారి ప్రపంచం మొత్తం బాలాపూర్ వైపు చూసేలా చేసింది.
గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తోంది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతోపాటు.. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ప్రతి ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.1,04,97970లను ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది.
బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) ఊరేగింపు అనంతరం గ్రామ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట జరుగుతుంది. ఈ వేలం పాటను చూసేందుకు స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది. వేలం పాట అనంతరం భక్తుల జయజయద్వానాలు, కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభయాత్ర వినాయక సాగరంవైపు కదులుతుంది.
Things Observed by Ganesh : బైబై.. మీలో మార్పు కోరుకుంటూ వెళ్లొస్తా..!
Hotel Setting Ganesh Idol : అకట్టుకుంటోన్న సెట్టింగ్.. కను'విందు' చేస్తోన్న గణేశుడు