చిత్తూరు జిల్లా
పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో... కరోనా వైరస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా 14 రోజులపాటు స్వీయ నిబంధనలో ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లా
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా బస్సులు ఎక్కువగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా
దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించించాలని కోరుతూ మురుమళ్లలో కొలువైన భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో వేద పండితులు సూర్యనారాయణ హోమం, ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. యానాంలో కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
పశ్చిమగోదావరి జిల్లా
కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు, ఉన్నత విద్య కోసం నిర్వహించే ఇతర ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మినహాయింపునిస్తూ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని సుమారు 450 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెయ్యికిపైగా ప్రాథమిక పాఠశాలలు, ఇతర ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. నెలాఖరు నాటికి పరిస్థితి చక్కబడితే తిరిగి తెరుచుకుంటాయని, ఇదే పరిస్థితి కొనసాగితే సెలవులు పొడిగించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కృష్ణా జిల్లా
వైరస్ ప్రభావంపై ఆలిండియా మెడికల్ కౌన్సిల్ కొన్ని సూచనలు చేసింది. ఈ సూచనలను అందరు పాటించాలని గుడివాడ ఐఎంఏ సభ్యులు కోరారు. కృష్ణా జిల్లా గుడివాడలో కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సభ్యులు... పదిహేను రోజులపాటు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు.
ప్రకాశం జిల్లా
కరోనా వైరస్‌ను నివారించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైరస్ గురించి అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
కడప జిల్లా
రాజంపేట ఆర్టీసీ డిపోలో కరోనా నివారణ చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గోడ పత్రాల ద్వారా ప్రచారం, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ బాలాజీ తెలిపారు.