AP News: తెదేపా సర్పంచి ఇంటిపై సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో వైకాపా నాయకులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, బాధితులు తెలిపిన మేరకు.. తెదేపా సర్పంచి చల్లా నాగమల్లేశ్వరి కుమారుడు హనుమంతు, మరికొందరు కలిసి ఆదివారం రాత్రి బొడ్డురాయి కూడలిలో మాట్లాడుకుంటున్నారు.
అదే సమయంలో వైకాపాకు చెందిన కందుల గంగారావు, మరి కొందరు కలిసి ఆవైపు రాగా వాదన తలెత్తింది. కొద్దిసేపటికి మాటామాటా పెరిగి గొడవకు దిగారు. తర్వాత హనుమంతు బంధువుల ఇంటికి వెళ్లారు. వైకాపా నాయకుడు గంగారావు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై హనుమంతు దాడిచేసి గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన కొందరు వైకాపా వర్గీయులతో కలిసి సర్పంచి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆవరణలోని కుర్చీలు, బెంచీ, ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి తలుపులు బాదారు.
ఆ సమయంలో ఇంట్లో సర్పంచి, ఆమె కోడలు దాక్షాయణి మాత్రమే ఉన్నారు. శబ్దానికి ఎవరూ అంటూ తలుపులు తీయగా.. హనుమంతు ఎక్కడున్నాడో చెప్పాలని, లేదంటే చంపేస్తామంటూ గంగారావు, ప్రతిమల శ్రీనివాసరావు అనే వ్యక్తి గొడ్డలి, గడ్డ పలుగు చూపించి బెదిరించారని సర్పంచి, ఆమె కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్ పత్రాప్‌కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: