Atchennaidu at Legal Cell State Level Meeting : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన.. టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సులో అచ్చెన్నాయుడు మాట్లాడారు. లోకేశ్ యువగళం పాదయాత్రలో రెండు రోజులకో కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్రంలో సైకో పాలన ఉంది : ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. నాలుగేళ్లలో తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై సదస్సులో చర్చించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు.
ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉండటానికి లీగల్ సెల్ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. 2019 తర్వాత రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీనే ఉండకూడదన్నట్లుగా సైకో పాలన ఉందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్సార్సీపీలా గాలికి పుట్టిన పార్టీ కాదని, జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గ్రహించాలని హితవుపలికారు. స్వాతంత్య్రం వచ్చాక న్యాయ విభాగం అవసరం ఇప్పుడొచ్చినంతగా ఎప్పుడూ రాలేదని అన్నారు. చెప్పటానికి బాధ అనిపిస్తున్నా న్యాయవాదులకు ఈ నాలుగేళ్లలో మంచిగా పని దొరికిందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
జగన్ నమ్మించి మోసం చేశాడు : ఎన్నికలకు ముందు నమ్మించాడు తర్వాత మోసం చేశారని ఎమ్మెల్సీ ఎన్నికల టీడీపీ కో-ఆర్డినేటర్ టీడీ జనార్దన్ దుయ్యబట్టారు. విశాఖలో వచ్చిన డెలిగేట్లకు సరిగా భోజన వసతి ప్రభుత్వం కల్పించలేదని ఆయన విమర్శించారు. జగన్ పోయేముందు పెట్టుబడుల సదస్సు ఎందుకని నిలదీశారు. మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి, టీడీపీ గెలుపు రెండు ఖాయమని టీడీ జనార్ధన్ స్పష్టంచేశారు. వైఎస్సార్సీపీకి దొంగ ఓట్లు వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ వైఎస్సార్సీపీ దొంగ ఓట్లను అడ్డుకునేందుకు పకడ్బందీగా వ్యవహరించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ 3 స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అందరూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌కి ఒక గుణపాఠం చెప్పడానికి గ్రాడ్యుయేట్స్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరిని టీడీపీ నేతలు కలుస్తున్నారని టీడీ జనార్ధన్ అన్నారు.
ఇవీ చదవండి: