Arguments in High Court on Chandrababu Petition in Sand Case: గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు పలువురిపై నవంబరు 1న సీఐడీ కేసు (CID case on Chandrababu) నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో పిటిషనర్ తరఫున సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇసుకను నిత్యావసర వస్తువు నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలపై భారాన్ని తగ్గించేందుకే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దానికి క్యాబినెట్ ఆమోదం ఉందని తెలిపారు. ఉచిత ఇసుక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు వివరిస్తున్నారనే చంద్రబాబుపై అక్రమ కేసులు: టీడీపీ నేతలు
ఇసుకను ఇతరులకు విక్రయించడానికి అనుమతించలేదని నిర్మాణ అవసరాలకే వినియోగించాలనడంతో రాజకీయ జోక్యం లేకుండా పోయిందని సిద్ధార్థ అగర్వాల్ కోర్టుకు నివేదించారు. మధ్యవర్తుల ప్రస్తావనే లేకుండా గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయగలిగారన్నారు. బడా వ్యాపారులు సొమ్ము చేసుకోకుండా నియంత్రించగలిగారని తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించి పర్యావరణ అనుమతులు పొందిన ఇసుక రేవులలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చారని న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును నిషేధించారని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు.
మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్లపై హైకోర్టులో విచారణ !
ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన సొమ్మును కాదనుకొని సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఉచిత ఇసుక ఇవ్వడం ఎలా తప్పవుతుందని సిద్ధార్థ్ అగర్వాల్ ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన ఆ కమిటీ ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. సీఐడీ ఆ విషయాన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎంపిక చేసుకున్న కొన్ని అంశాలనే తెరపైకి తెస్తోందని సిద్ధార్థ్ అగర్వాల్ వాదించారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తోందన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17-A ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలన్నీ సీఐడీ వద్ద ఉన్నాయన్నారు.
కొంతమంది ప్రయోజనం కోసమే ఉచిత ఇసుక విధాన నిర్ణయాన్ని తీసుకున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసు ద్వారా విచారణకు వీల్లేదని ఇసుక ఉచితంగా ఇచ్చినప్పుడు ఖజానాకు నష్టం జరిగినట్లు భావించకూడదన్నారు. ఉచిత విధానం చట్ట విరుద్ధం కాదని విధానపరమైన నిర్ణయాన్ని నేరపూర్వక చర్యగా భావించడానికి వీల్లేదని సిద్ధార్థ్ అగర్వాల్ తెలిపారు. 2016 మార్చి నుంచి 2019 సెప్టెంబరు వరకు ఉచిత ఇసుక విధానం అమలులో ఉందని గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్నే సెప్టెంబరు వరకు కొనసాగించిందన్నారు. అందులో లోపాలుంటే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఏడేళ్ల తర్వాత చేసిన ఫిర్యాదు చెల్లదని ఇన్నేళ్ల జాప్యానికి కారణమేంటో కూడా పేర్కొనలేదని సిద్ధార్థ్ అగర్వాల్ తెలిపారు. దర్యాప్తునకు పిటిషనర్ సహకరిస్తారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సిద్ధార్థ్ అగర్వాల్ కోరారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ ప్రతి వాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.