High Court notices to contempt of court petition: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం జిల్లాలోని కురుపాం అమ్మఒడి సభకు విద్యార్థుల తరలింపుపై ఆదివాసి గిరిజన చైతన్య వేదిక అధ్యక్షుడు చొక్కారావు హైకోర్టులో పిల్ వేయగా.. అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ వాదించారు. విద్యార్థులను రాజకీయ సభలకు తరలించడం చట్టవిరుద్ధమన్న హైకోర్టు.. ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళ్తే.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోంశాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్వతీపురం జిల్లాలో కురుపాంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థుల తరలింపుపై ఆదివాసి గిరిజన చైతన్య వేదిక అధ్యక్షుడు చొక్కారావు దాఖలు చేసిన.. కోర్టు ధిక్కార పిటిషన్పై విచారణకు హైకోర్టు అనుమతించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు.. పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ తన వాదనలు వినిపించారు. సీఎం జగన్ పాల్గొన్న సభకు భారీ ఎత్తున విద్యార్థులను తరలించి.. అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు ఇది విరుద్ధమని న్యాయవాది వాదించారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేసుగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం.. దీనిపై విచారణ జరిపింది. విద్యార్థులను తరలించిన అంశాన్ని.. సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖ అధికారులు సమాచారం అందించిన వివరాలను న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. అయితే అధికారులే సమాచారం ఇచ్చారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యార్థులను.. రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తలించకూడదంటూ.. హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేస్తూ ఇచ్చిన తీర్పును.. న్యాయవాది ధర్మాసనానికి గుర్తు చేశారు. దీంతో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో వివిధ పథకాలకు బటన్లు నొక్కేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు విద్యా కానుక వంటి పథకాలకు సీఎం బటన్లు నొక్కి నిధులను విడుదల చేస్తున్నారు. ఇవి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి అధికారులు వివిధ పాఠశాలల నుంచి స్టూడెంట్స్ను సీఎం సభలకు తరలిస్తున్నారు. ఇలా ఒక్క కురుపాం సభకే కాకుండా విద్యా రంగ పథకాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకు పిల్లల్ని భారీ ఎత్తున తరలిస్తున్నారు. అయితే విద్యార్థులను.. రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలకు తలించకూడదంటూ.. హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కోర్టు ధిక్కార పిటిషన్ను విచారణకు అనుమతించిన ధర్మాసనం.. విద్యాశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.