AP Government Increased Estimated Cost of Projects: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో వెచ్చించిన మొత్తం కన్నా, పెరిగిన అంచనాల విలువ ఎక్కువ కావడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 30,323.89 కోట్ల మేర అంచనాలను ప్రభుత్వం పెంచేసింది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని నాడు జగన్ చెప్పిన మాటలకు, నేటి చేతలకు పొంతన లేదు. ఎక్కడా అవసరాల మేర నిధులు కేటాయించడం లేదు. కేటాయించిన వాటిలోనూ సగమైనా వెచ్చించడం లేదు.
పనులు చేసిన గుత్తేదారులకు సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు. అనేక మంది గుత్తేదారులు పనులు అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే పురోగతిలో ఉన్న కొన్ని ప్రాజెక్టుల పనులను నిలిపివేయించిన ప్రభుత్వం.. మరోపక్క చేపట్టాల్సిన వాటి అంచనాలను సైతం భారీగా పెంచేసింది. వీటిలో కొన్నింటికి టెండర్లు పిలిచి అస్మదీయులకు అప్పగించేసింది. కొన్నిచోట్ల రద్దు చేసిన ప్యాకేజీలను తిరిగి ప్రారంభించలేదు. నిర్మాణాలో జాప్యం.. అంచనాల పెంపు.. నిధులు వెచ్చించకపోవడం.. వెరసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ రంగం ఒక ప్రహసనంలా మారింది.
Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు
No Development in Irrigation Projects in AP: శ్రీశైలం వరద జలాలను ఉమ్మడి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు అందించే గాలేరు నగరి సుజల స్రవంతి పథకం అంచనాలు వైసీపీ హయాంలో భారీగా పెరిగిపోయాయి. 2019 జూన్‌తో పోలిస్తే 2,366.72 కోట్ల అంచనాలు పెంచేశారు. ఈ ప్రాజెక్టు సాకారమైతే రాయలసీమలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు తాగునీటి వసతి లభిస్తుంది. రెండో దశలోని కొన్ని ప్యాకేజీల పనులను ఇప్పటికే రద్దు చేశారు. ఆ ప్యాకేజీలో మిగిలిన పని విలువను తాజాగా లెక్కించి మళ్లీ టెండర్లు పిలిచేందుకు జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈ లెక్కలు కూడా తేలితే ప్రాజెక్టు అంచనాలు ఇంకా పెరగనున్నాయి.
హంద్రీ నీవా తొలి రెండు దశలకు సంబంధించి 1,144.20 కోట్ల మేర అంచనాలు పెరిగిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 6,383 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. గతంలోనే తొలిదశ పనులు పూర్తికాగా, ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీలు నిర్మించలేదు. రెండో దశలో ఇప్పటికే వైసీపీ సర్కారు కొన్ని ప్యాకేజీల పనులు రద్దుచేసింది. మిగిలిన వాటి విలువను తాజాగా లెక్కించి మళ్లీ టెండర్లు పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఉత్తరాంధ్రలో కీలకమైన బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు రెండో దశ రెండో భాగం పనులకు ప్రభుత్వం సరిపడా నిధులివ్వడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాల్లోని 225 గ్రామాల్లో తాగునీరు, వ్యవసాయ అవసరాలను తీర్చే ప్రాజెక్టు ఇది. దీనికి 1,008.27 కోట్ల మేర అంచనాలు ఇప్పటికే పెంచగా, పునరావాస కల్పనకు మరో 216.71 కోట్లు పెంచబోతున్నారు. ఈ ప్రాజెక్టుపై మొత్తంగా 1,224.78 కోట్ల వరకు అంచనాలు పెంచినట్లవుతుంది.
శ్రీశైలం నుంచి ఉమ్మడి కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందించేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టులో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొత్తం 15.25 లక్షల జనాభాకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 2019 నాటికి 5,564.22 కోట్ల అంచనాతో పనులు సాగుతుండేవి. ప్రస్తుత ప్రభుత్వం 8,054.14 కోట్లకు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గోదావరి జలాలను ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాలకు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనుల అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. గతంలో 4,909 కోట్ల వ్యయ అంచనాతో పనులు చేపట్టగా తాజాగా 9,543 కోట్లకు పెంచుతూ జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చేందుకు ఉద్దేశించిన పథకమిది.
ఈ ప్రాజెక్టును 7,214.10 కోట్లతో రెండు దశల్లో చేపట్టాలని తొలుత పాలనామోదం ఇచ్చారు. టీడీపీ హయాంలో 2019కి ముందే తొలి దశను 2,022.20 కోట్లతో చేపట్టేలా అంచనాలు సవరించారు. తాజాగా రెండు దశలూ కలిపి 16,249.17 కోట్లకు పెంచారు. రెండు దశల్లోని కొన్ని ప్యాకేజీలకు టెండర్లను పిలిచినా పనులు మాత్రం జరగడం లేదు.
చింతలపూడి ఎత్తిపోతల అంచనాల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. గతంలోనే రూ.4,909.80 కోట్ల మేర అంచనాలు ఆమోదించగా, తాజా ప్రతిపాదనల్లో అది మరో రూ.4,600 కోట్లకు పైగా పెరగనుంది. ప్రభుత్వం పరిశీలన చేసి, సవరించిన అంచనాలకు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఉత్తరాంధ్రలోని వంశధార రెండో దశలో పునరావాసం కింద మరో 216 కోట్ల రూపాయలు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
మహేంద్రతనయ ప్రాజెక్ట్‌లో 2019 తర్వాత 385.17 కోట్ల రూపాయలతో తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులో రూ.268.59 కోట్లు, మడ్డువలస రెండో దశకు రూ.26.90 కోట్ల మేర అంచనాలను పెంచారు. వీటిపై ఉత్తర్వులు వెలువడితే రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.30,323.89 కోట్ల వరకు పెరిగినట్లయింది.