Anganwadi Workers Protest: రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని అంగన్వాడీలు స్పష్టం చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం చేయలేని ప్రభుత్వం, ఈనెల 5వ తేదీ లోగా విధుల్లో చేరకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అన్యాయమన్నారు.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ విమర్శించారు. గత 22 రోజుల నుంచి అంగన్వాడీలు పోరాడుతుంటే వారి డిమాండ్లు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాలు ఇచ్చేవరకు, గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించే వరకు అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు
అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ నెల 9న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు పోరాడుతుంటే, డిమాండ్లు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు. కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మైంట్ బెనిఫిట్స్ కల్పించే వరకు కార్మికులు, ఉద్యోగుల సమ్మె విరమించరని స్పష్టం చేశారు. సీఎం జగన్కు సొంత పార్టీ నేతలు, సొంత చెల్లెల నుంచే తిరుగుబాటు మొదలయ్యిందని మండిపడ్డారు.
లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేని వైసీపీ ప్రభుత్వం ఈనెల 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వడం అన్యాయమన్నారు.
అంగన్వాడీలకు కార్మిక సంఘాల మద్దతు - 9న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. మంత్రి ఉష నివాసం ముట్టడి సందర్భంగా పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బ్రహ్మసముద్రంలో దున్నపోతుకు వినతిపత్రం అందించారు.
అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని ఉరవకొండలో కార్యకర్తలు హెచ్చరించారు. అధికారుల బెదిరింపులకు భయపడబోమని, సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని పుట్టపర్తిలో కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందూపురంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో ర్యాలీ నిర్వహించి పశువుకు వినతిపత్రం అందచేశారు.
ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు దున్నపోతుల వేషాలు వేసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మార్కాపురంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దున్నపోతుకు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పొర్లుదండాలు పెడుతూ, మోకాళ్లపై నిల్చుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రభుత్వం ఇచ్చిన చీరలతో ఉరేసుకుని నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో పాటలు పాడుతూ ఆందోళన కొనసాగించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన కొనసాగింది.
కొవ్వొత్తులతో అంగన్వాడీల నిరసనలు - డిమాండ్లు పరిష్కరించేవరకు వెనక్కు తగ్గబోమని స్పష్టం