Andhra Pradesh Top in Debts: ఏపీకి రుణాలను భరించే సామర్థ్యం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు (CAG Report) ఎప్పుడో హెచ్చరించినా, జగన్ సర్కార్ వాటిని వినే పరిస్థితిలో లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ తన ధోరణిలో సాగిపోతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లోనే దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేసేసింది.
ఆగస్టు నెలాఖరు వరకు వివిధ రాష్ట్రాల కాగ్ (Comptroller and Auditor General of India) గణాంకాలు పరిశీలిస్తే, ఏ రాష్ట్రానికీ అందనంత ఎక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రుణాలు తీసుకుంది. 53 వేల 557 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే కాగ్‌కు తెలిపింది. దేశంలోని 14 కీలక రాష్ట్రాల రుణాల తీరులను కాగ్ గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే వాటి దరిదాపుల్లో లేనంత అధికంగా అప్పులు చేసినది మన రాష్ట్రమే.
దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, గతంలో బాగా రుణాలు చేసి, తొలి 10 స్థానాల్లో ఉన్నాయని కేంద్రం ప్రస్తావించిన రాష్ట్రాలను పోల్చిచూసినా.. వాటన్నింటిలోనూ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. ఏపీ తొలి అయిదు నెలల్లో 53 వేల 557 కోట్ల అప్పు చేస్తే, ఆ తర్వాతి స్థానంలో ఉన్న తమిళనాడు 33,142.76 కోట్లు తీసుకున్నట్లు కాగ్ పేర్కొంది.
అసలు కాగ్‌కు రాష్ట్రప్రభుత్వం తన గ్యారంటీ రుణాల వివరాలు సమర్పించ లేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాల వివరాలూ చెప్పలేదు. అవన్నీ కలిపితే ఈ రుణం ఇంకా ఎక్కువే ఉంటుంది. ఏడాది మొత్తానికి 54,587.52 కోట్ల అప్పు చేస్తామని రాష్ట్రప్రభుత్వం చట్టసభలకు హామీ ఇచ్చింది. తొలి నాలుగు నెలల్లోనే అంచనాల్లో 98 శాతం మేర రుణాలు తీసేసుకోవడం గమనార్హం.
అప్పులు తీసుకున్నా.. ఆస్తుల సృష్టికే వాటిని వినియోగించాలి. కానీ, రాష్ట్రంలో మూలధన వ్యయం తక్కువే. తొలి 5 నెలల్లో మూలధన వ్యయం రూపేణా 15 వేల 883 కోట్లు ఖర్చుచేసినట్లు కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెలిపినా, అందులోనూ అనేక మతలబులున్నాయి. అసలు నిధులు వెచ్చించకుండానే ఖర్చులు రాసేసే పి.డి. ఖాతాల మాయాజాలంలో ఈ వ్యవహారం చేరిపోయింది. ఇందులో 6 వేల కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చురాసేసిన వ్యవహారాలే ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధిపై సర్వత్రా ఆందోళన రేకెత్తుతోంది.తొలి అయిదు నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు అంచనాలను దాటిపోయింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటు 22,316.70 కోట్లు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేశారు. అలాంటిది తొలి అయిదు నెలల్లోనే అది 37,326.72 కోట్లకు చేరింది. అంటే, ఇప్పటికే అంచనాలతో పోలిస్తే 119 శాతం రెవెన్యూ లోటు ఉంది.
AP Debts: అందినకాడికి అప్పులు.. 9 నెలల అప్పులు 4 నెలల్లోనే..