Andhra Pradesh Teachers Federation Dharna: సామాజిక భద్రత లేని సీపీఎస్‌ను రద్దు చేసి దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నాచౌక్‌లో ఈనెల 15న ధర్నా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
గత నాలుగున్నర సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం డీఏ బకాయిలను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కాలయాపన చేసిందని, ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల మండిపడ్డారు. 149 నెలల డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. పెండింగులో ఉన్న పీఎఫ్ లోన్లు, పీఎఫ్ పార్టు పేమెంట్లు, ఏపీజీయల్ఐ లోన్లు అలాగే మంజూరు అయిన సరెండర్ లీవ్ మొత్తాలను చెల్లించాలన్నారు.
ఉద్యోగులకు ఒకటవ తేదిన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ విధి అని కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు ఎప్పుడు ఇస్తున్నారో వారికే తెలియడం లేదన్నారు. జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ప్రతినెల ఒకటవ తేదినే జీతాలు చెల్లించాలని అనేక మార్లు డిమాండ్ చేసినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హమీని.. నిలబెట్టుకోకుండా మాట మార్చి జీపీఎస్ తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మాత్రం కుంటి సాకులు చెబుతుందని ఫెడరేషన్ ప్రతినిధులు మండిపడుతున్నారు.
పాఠశాలల విలీనమనేది ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయమని తాము ముందుగానే చెప్పామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు అన్నారు. పాఠశాలల వీలీనాన్ని రద్దు చేయాలన్నారు. విద్యా వ్యవస్థకు ఆటంకంగా మారిన జీవో 117ను రద్దు చేయాలన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మోగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పారని, ఇంత వరకు ఎన్ని డీఎస్సీలు విడుదల చేశారో విద్యాశాఖ అధికారులు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్నారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కానీ తప్పని పరిస్థితుల్లోనే ఆందోళనలు చేయాల్సి వస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 11వ పీఆర్సీ బకాయిలు విడుదల చేయడంలో, సకాలంలో ఉద్యోగులకి రావలసిన డీఏలు మంజూరు చేయడంలో, డీఏల అరియర్లు జమ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని మండిపడ్డారు.
మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని.. వారికి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీలలోని ఉన్నత పాఠశాలలలో విద్యార్ధుల సంఖ్యను బట్టి సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు మంజూరు చేయాలని సూచించారు.
ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ తమకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తాము న్యాయమైన డిమాండ్లనే ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే భావిస్తున్నామని తెలిపారు. తమను ఇబ్బందులు పెట్టాలని చూస్తే తర్వాత వారే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే తాము ఈనెల 15వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ధర్నాను నిర్వహిస్తున్నామని పెర్కొన్నారు. ఉపాధ్యాయులు ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
No Salaries to Teachers: 'మొదటి తేదీన కాకుండా.. ఉన్నప్పుడు జీతం ఇస్తామనే ధోరణి సరికాదు'