Andhra Pradesh Govt Diverting Panchayat Funds: పంచాయతీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కన్నేసినట్లు తెలుస్తోంది. గతంలో పంచాయతీ నిధులను దారి మళ్లించడంతో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా సరే బుద్ధి మార్చుకోని రాష్ట్ర ప్రభుత్వం, మరోసారి పంచాయతీ నిధులపై పడింది.
అత్యవసర పనుల కోసం సర్పంచులు పంచాయతీ ఖాతాల్లో ఉంచిన 15వ ఆర్థిక సంఘం నిధులను (15th Finance Commission Funds to Panchayats) ప్రభుత్వం వాడుకోడానికి యత్నిస్తోంది. ఖాతాల్లో నిధులు వెంటనే వినియోగించుకోపోతే మరోసారి విద్యుత్తు ఛార్జీలకే సర్దుబాటు చేస్తామని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారి ఒకరు జిల్లా పంచాయతీ అధికారులకు రెండు రోజుల కిందట ఇదే విషయాన్ని చెప్పారు.
పంచాయతీలకు శాపంగా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు - నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేయించాలన్న సర్పంచులు
దీనిపై వారంతా పంచాయతీ కార్యనిర్వాహక అధికారులకు సమాచారం ఇచ్చారు. 2022-23 సంవత్సరానికి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 9 వందల 88 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 3 వందల 50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద డిస్కంలకు మళ్లించింది.
మిగతా మొత్తాలను ఈ ఏడాది జూన్‌లో పంచాయతీల ఖాతాల్లో వేయగా.. అందులో 2 వందల 50 కోట్ల వరకు ఇంకా మిగిలి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యవసర పనుల కోసం సర్పంచులు వీటిని ఖాతాల్లో ఉంచగా.. నెలాఖరులోగా వినియోగించుకోవాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. వాటిని ఖర్చు చేస్తేనే కేంద్రం రెండో విడత నిధులు విడుదల చేస్తుందని చెబుతున్నారు. పంచాయతీలు ఖర్ఛు చేయని నిధులను ప్రభుత్వం ఈ విధంగా మరోసారి విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించాలని యోచిస్తున్నట్లుగా కనిపిస్తోందని సర్పంచులు వాపోతున్నారు.
Central Govt on AP Panchayat Funds Diversion: అయితే ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 80 నుంచి 90శాతం నిధులను విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లించటంపై ప్రభుత్వాన్ని వివరణ సైతం కోరింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీలకు కేటాయిస్తోన్న ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ ఛార్జీలకు సర్దుబాటు చేయటంపై కన్నెర్ర చేసింది.
Sarpanches Fires on Andhra Pradesh Govt: నిధులను దారి మళ్లించిన విషయంలో ప్రభుత్వంపై గ్రామ సర్పంచులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఆందోళనలకు సైతం పిలుపునిచ్చారు. నిధులు లేక గ్రామాల్లో కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టలేకపోతున్నామని మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు ఏమో అత్యవసర పనుల కోసం ఉంచిన నిధులపై కూడా ప్రభుత్వం కన్నేసింది. దీనిపై సర్చంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.